అందుబాటు ధరలో కావాల్సినంత ఇసుక…!
మిర్యాలగూడ లో సాండ్ బజార్ ప్రారంభం
మిర్యాలగూడ, ఆగస్టు 07,(ప్రజాజ్యోతి): ఇసుక అక్రమ దందా ని అరికట్టి, అందుబాటు ధరలో కావలసినంత ఇసుక అందుబాటులో ఉంచేందుకే సాండ్ బజార్ ఏర్పాటు చేసినట్లు మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) అన్నారు. గురువారం మిర్యాలగూడ పట్టణంలో ని చింతపల్లి ఎక్స్ రోడ్ వద్ద తెలంగాణ రాష్ట్ర మైనింగ్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సాండ్ బజార్ ను మైనింగ్ శాఖ ఎండి, వైస్ చైర్మన్ భవేష్ మిశ్రా, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి, స్థానిక ఎమ్మెల్యే బిఎల్ఆర్, సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ లతో కలిసి ప్రారంభించారు. చింతపల్లి ఎక్స్ రోడ్ లోని నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిలో అందరికీ అందుబాటులో కావలసినంత ఇసుక లభ్యమయ్యేలా ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోనే హైదరాబాద్ తర్వాత మిర్యాలగూడలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇసుక అక్రమ దందా అరికట్టడంతో పాటు సామాన్యులకు అందుబాటు ధరలో ఉంచేందుకు సాండ్ బజార్ ఏర్పాటు చేయటం జరుగుతుందన్నారు. టన్నుకు 1250 రూపాయల చొప్పున కావలసినంత ఇసుక అందుబాటులో ఉంటుందన్నారు. ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇంకా తక్కువ ధరకే ఇసుక అందించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే బిఎల్ఆర్ మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం ధ్యేయంగా తక్కువ ధరకు ఇసుక తో పాటు, స్థానిక సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యాల తో మాట్లాడి బస్తాకు 50 రూపాయల చొప్పున తగ్గింపు ధరలో అందించనున్నట్లు తెలిపారు. ఇటికలు కూడా మార్కెట్ రేట్ కంటే ఒక రూపాయి తక్కువ కు అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనింగ్ ఏడి జాకోబ్, తహసిల్దార్ సురేష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.