హైదరాబాద్ మహానగరంలో సోమవారం సాయంత్రం కురిసిన వర్షం ఒక్కసారిగా భయానక వాతావరణాన్ని సృష్టించింది. నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటైన గచ్చిబౌలిలో భారీ శబ్దంతో పిడుగు పడటంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.
వివరాల్లోకి వెళితే, గచ్చిబౌలి పరిధిలోని ఖాజాగూడ ల్యాంకో హిల్స్ సర్కిల్ వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. అక్కడ ఉన్న హెచ్పీ పెట్రోల్ బంకుకు ఎదురుగా ఉన్న ఓ తాటిచెట్టుపై ఉరుములతో కూడిన వర్షం మధ్యలో ఒక్కసారిగా పిడుగు పడింది. పెను శబ్దంతో పాటు వెలుగులు విరజిమ్మడంతో సమీపంలోని వాహనదారులు, స్థానిక నివాసితులు తీవ్రంగా భయపడ్డారు. ఏం జరిగిందో తెలియక కొందరు భయంతో పరుగులు తీశారు.
పిడుగుపాటు తీవ్రతకు తాటిచెట్టు పైభాగంలో మంటలు చెలరేగి, చెట్టు పాక్షికంగా కాలిపోయింది. వర్షం కురుస్తున్న సమయం కావడంతో జనసంచారం కాస్త తక్కువగా ఉంది. దీంతో ఎవరికీ ఎలాంటి హాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నగర నడిబొడ్డున ఇలాంటి ఘటన జరగడంతో స్థానికంగా కాసేపు ఆందోళనకర వాతావరణం నెలకొంది