సూర్యాపేట జిల్లా ప్రతినిధి జూలై 15(ప్రజాజ్యోతి):నడిగూడెం మండల కేంద్రంలో ఉన్న కస్తూరిబా గాంధీ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని నిమ్మ తనుశ మహాలక్ష్మి మృతి పట్ల సమగ్ర విచారణ జరపాలని పి.డి.ఎస్.యు,ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో డెడ్ బాడీ తో స్థానిక ఏరియా హాస్పిటల్ నందు ధర్నా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షులు పుల్లూరు సింహాద్రి ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ధనియాకుల శ్రీకాంత్ వర్మ,మాట్లాడుతూ,విద్యాసంస్థల్లో విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్న అధికారులకు చీమకుట్టినట్లు కూడా లేదన్నారు.ఎంతో చురుకుగా ఉంటూ బాగా చదివే విద్యార్థిని తనిషా మృతి పట్ల అనేక అనుమానాలు ఉన్నాయన్నారు.చనిపోవటానికి ముందు రోజే పేరెంట్స్ తో సంతోషంగా గడిపిన తనిషా ఆకస్మికంగా ఉరితాడుకు వేలాడటం తల్లిదండ్రులకు అనుమానాలు రేకెత్తిస్తుందన్నారు.ఒకవైపు పోలీస్ విచారణ జరుగుతుండగా పోస్టుమార్టం రిపోర్ట్ రాకముందే విద్యార్థిని చనిపోయిన గంటకే డీఈవో కుటుంబ తగాదాలతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది మీడియాకు మరియు సోషల్ మీడియాలో ప్రకటించడం సరైంది కాదన్నారు.ఎలాంటి కుటుంబ కలహాలు లేకున్నా డీఈవో అలా ప్రకటించడం పట్ల తల్లిదండ్రులు మానసికంగా కృంగిపోయారన్నారు. తప్పుడు ప్రచారం చేసిన డీఈఓ ను సస్పెండ్ చేయాలన్నారు. విద్యార్థిని మృతి పట్ల సమగ్ర విచారణ పారదర్శకంగా జరిపించి, కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించి , కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు డివిజన్ ప్రధాన కార్యదర్శి పిడమర్తి భరత్, దూదిపాల ప్రవీణ్,ఎస్ఎఫ్ఐ నాయకులు యాతకుల ప్రవీణ్, పులుసు శ్రవణ్ కుమార్, శివ, గణేష్, తదితరులు పాల్గొన్నారు.