మయన్మార్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సగయింగ్ ప్రాంతంలోని ఒక బౌద్ధారామంపై జరిగిన వైమానిక దాడిలో 23 మంది మృతి చెందగా, 30 మందికి పైగా గాయపడ్డారు. ఈ విషయాన్ని స్థానిక మీడియా వెల్లడించింది. క్షతగాత్రుల్లో పది మంది పరిస్థితి విషమంగా ఉందని ఆన్ లైన్ మీడియా తెలిపింది.
బౌద్ధారామానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి దాదాపు 150 మంది ఆశ్రయం పొందుతున్నారని తిరుగుబాటుదారుల నాయకుడు ఒకరు వెల్లడించారు. అయితే, ఈ దాడులపై అక్కడి మిలటరీ ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటనా చేయలేదు.
2021 ఫిబ్రవరిలో అంగ్ సాన్ సూకీ ప్రభుత్వాన్ని కూలదోసి సైన్యం అధికారాన్ని స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి మయన్మార్ అల్లకల్లోలంగా ఉంది. ఇది క్రమంగా అంతర్యుద్ధానికి దారితీసింది. శాంతియుత నిరసనలను సైన్యం అణిచివేయడంతో తిరుగుబాటుదారులు ఆయుధాలు చేపట్టారు.
దీంతో సైనికులకు, తిరుగుబాటుదారులకు మధ్య ఘర్షణలతో మయన్మార్ అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో బౌద్ధారామంలో తిరుగుబాటుదారులు తలదాచుకుంటున్నట్లు సమాచారం అందడంతో సైన్యం వైమానిక దాడి చేసినట్లు తెలుస్తోంది.