ఓ ప్రైవేట్ వీడియోను అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తున్న ఇద్దరి వేధింపులు తాళలేక ఓ చార్టెర్డ్ అకౌంటెంట్ (సీఏ) ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన ముంబైలో చోటుచేసుకుంది. మృతుడు రాజ్ లీలా మోరే (32) తన చావుకు కారణమైన ఇద్దరి పేర్లను సూసైడ్ నోట్లో వెల్లడించారు.
వివరాల్లోకి వెళితే, రాజ్ మోరే ఓ మంచి కంపెనీలో సీఏగా పనిచేస్తూ స్టాక్ మార్కెట్లో భారీగా పెట్టుబడులు పెట్టారు. ఈ విషయం తెలిసిన రాహుల్ పర్వానీ, సబా ఖురేషీ అనే ఇద్దరు వ్యక్తులు.. రాజ్ మోరేకు సంబంధించిన ఓ ప్రైవేట్ వీడియోను సంపాదించారు. దాన్ని బయటపెడతామని బెదిరిస్తూ గత 18 నెలలుగా ఆయన నుంచి రూ.3 కోట్లకు పైగా డబ్బు గుంజారు. అంతటితో ఆగకుండా, ఆయన విలాసవంతమైన కారును సైతం బలవంతంగా లాక్కున్నారని అధికారులు తెలిపారు.
ఈ వేధింపులతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన రాజ్ మోరే, మంగళవారం విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనా స్థలంలో పోలీసులకు మూడు పేజీల సూసైడ్ నోట్ లభించింది. “నా ఆత్మహత్యకు రాహుల్ పర్వానీ, సబా ఖురేషీలే కారణం. నన్ను బ్లాక్మెయిల్ చేసి, నా సేవింగ్స్ అన్నింటినీ దోచుకున్నారు. కంపెనీ అకౌంట్ నుంచి కూడా డబ్బు దొంగిలించేలా చేశారు” అని ఆయన ఆ నోట్లో ఆరోపించారు.
మరో పేజీలో తన తల్లికి క్షమాపణలు చెప్పగా, ఇంకో పేజీలో తన సహోద్యోగులను ఉద్దేశించి రాశారు. “దీపా లఖానీ, మీ నమ్మకాన్ని వమ్ము చేసినందుకు క్షమించండి. నేను చేసిన మోసానికి నేనే బాధ్యుడిని. శ్వేత, జైప్రకాశ్ లకు ఏమీ తెలియదు, దయచేసి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు” అని అందులో పేర్కొన్నారు.
గత కొద్ది నెలలుగా తన కుమారుడు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడని మృతుడి తల్లి పోలీసులకు తెలిపారు. రాజ్ మోరే సూసైడ్ నోట్ ఆధారంగా రాహుల్ పర్వానీ, సబా ఖురేషీలపై పోలీసులు బలవంతపు వసూళ్లు, ఆత్మహత్యకు ప్రేరేపించడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.