ట్రంప్ ఎఫెక్ట్… పెరగనున్న వీసా ఫీజులు

V. Sai Krishna Reddy
1 Min Read

అమెరికాలో విద్య, ఉద్యోగం, పర్యటన కోసం వెళ్లాలనుకునే వారికి ఇది కొంత భారంగా పరిణమించనుంది. అమెరికా ప్రభుత్వం తాజాగా నాన్-ఇమిగ్రెంట్ వీసాలపై ‘వీసా ఇంటిగ్రిటీ ఫీజు’ పేరుతో కొత్త రుసుమును ప్రవేశపెట్టింది. ఇటీవల ఆమోదం పొందిన ‘వన్‌ బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లు’ చట్టంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం, వీసా దరఖాస్తుదారులు ఇకపై అదనంగా 250 డాలర్లు (రూ.21,435) తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది.

ఈ కొత్త నిబంధన ప్రభావం ముఖ్యంగా అంతర్జాతీయ విద్యార్థులు, హెచ్-1బీ వీసాపై వెళ్లే సాంకేతిక నిపుణులు, పర్యాటకులపై పడనుంది. హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం (DHS) ఈ ఫీజును వసూలు చేయనుంది. ఇమిగ్రేషన్ సేవల సంస్థ ఫ్రాగోమెన్ నివేదిక ప్రకారం, ఈ ఫీజును 2026 నుంచి వినియోగదారుల ధరల సూచీ (CPI) ఆధారంగా ఏటా పెంచే అధికారాన్ని కూడా డీహెచ్‌ఎస్‌కు కల్పించారు.

రీఫండ్‌కు కఠిన నిబంధనలు

అయితే, వీసా నిబంధనలను కచ్చితంగా పాటించిన వారికి ఈ ఫీజును తిరిగి పొందే వెసులుబాటు కల్పించారు. వీసా పొందిన వ్యక్తి తన ఐ-94 గడువు ముగియడానికి కనీసం ఐదు రోజుల ముందు అమెరికాను విడిచి వెళ్లాలి. ఒకవేళ వీసా పొడిగింపు లేదా స్టేటస్ మార్పు కోసం దరఖాస్తు చేసుకోకుండా ఈ నిబంధన పాటించినా, లేదా గడువులోగా చట్టబద్ధంగా శాశ్వత నివాస హోదా పొందినా మాత్రమే ఈ 250 డాలర్ల ఫీజు రీఫండ్‌ అవుతుంది. ఈ రుసుముతో పాటు భవిష్యత్తులో ఐ-94, ఈఎస్‌టీఏ, ఈవీయూఎస్‌ వంటి ఇతర ఫీజులు కూడా పెరగనున్నాయని సమాచారం. ఈ మార్పులు శరణార్థుల వీసా దరఖాస్తులపై కూడా ప్రభావం చూపనున్నాయి.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *