తనను ‘బలహీనమైన ఆటగాడు’ అంటూ తక్కువ చేసి మాట్లాడిన చెస్ దిగ్గజం మాగ్నస్ కార్ల్‌సన్‌కు భారత యువ గ్రాండ్‌మాస్టర్, ప్రపంచ ఛాంపియన్ డి. గుకేశ్ తన ఆటతో గట్టి సమాధానం ఇచ్చాడు. క్రొయేషియాలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక గ్రాండ్ చెస్ టూర్ సూపర్ యునైటెడ్ ర్యాపిడ్ 2025 టోర్నీలో కార్ల్‌సన్‌పై అద్భుత విజయం సాధించి సంచలనం సృష్టించాడు. గురువారం జరిగిన ఆరో రౌండ్ పోరులో నల్లపావులతో ఆడిన గుకేశ్, కార్ల్‌సన్‌ను ఓడించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
ఈ గెలుపుతో గుకేశ్ టోర్నమెంట్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. టోర్నీకి ముందు కార్ల్‌సన్ మాట్లాడుతూ.. “ఇలాంటి టోర్నీలలో రాణించగలడని చెప్పడానికి గుకేశ్ ఏమీ నిరూపించలేదు. అతడిని నేను బలహీనమైన ఆటగాళ్లలో ఒకరిగానే భావిస్తాను” అని వ్యాఖ్యానించాడు. ఆ వ్యాఖ్యల నేపథ్యంలో గుకేశ్ సాధించిన ఈ విజయం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ టోర్నమెంట్‌లో గుకేశ్‌కు ఇది వరుసగా ఐదో విజయం కావడం విశేషం. రెండో రోజు ఆటలో భాగంగా అంతకుముందు ఉజ్బెకిస్థాన్‌కు చెందిన నోదిర్‌బెక్ అబ్దుసత్తరోవ్, అమెరికన్ గ్రాండ్‌మాస్టర్ ఫాబియానో కరువానాపై కూడా గుకేశ్ గెలుపొందాడు. తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైనప్పటికీ, ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుని విజయాల పరంపరను కొనసాగిస్తున్నాడు.