ఫుడ్ డెలివరీ చేసేందుకు వెళ్లిన ఒక వ్యక్తి ఊహించని రీతిలో ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ముంబయిలో చోటుచేసుకుంది. ఆర్డర్ ఇచ్చేందుకు ఒక భారీ భవనంలోని 22వ అంతస్తుకు వెళ్లిన అతడు, ప్రమాదవశాత్తు అక్కడి స్విమ్మింగ్ పూల్లో పడి చనిపోయాడు. ఈ దుర్ఘటన దక్షిణ ముంబయి పరిధిలో జరిగింది.
పూర్తి వివరాల్లోకి వెళితే… ముంబయికి చెందిన ఇమ్రాన్ అక్బర్ ఖోజ్దా (44) ఒక ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలో ఏజెంట్గా పనిచేస్తున్నాడు. రోజూలాగే మంగళవారం రాత్రి ఆయనకు గ్రాంట్ రోడ్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఒక బహుళ అంతస్తుల భవనం నుంచి ఫుడ్ ఆర్డర్ వచ్చింది. ఆ డెలివరీ ఇచ్చేందుకు ఇమ్రాన్ ఆ భవనంలోని 22వ అంతస్తుకు చేరుకున్నాడు.
అధికారుల కథనం ప్రకారం, ఇమ్రాన్ ఫోన్లో మాట్లాడుతూ నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ క్రమంలో 22వ అంతస్తులో ఉన్న స్విమ్మింగ్ పూల్ అంచు వద్దకు చేరుకుని, అదుపుతప్పి అందులో పడిపోయాడు. ఆ సమయంలో చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ఆయన్ను రక్షించేందుకు వీలు కాలేదు. దీంతో నీటిలో మునిగిపోయి ఇమ్రాన్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న గామ్దేవీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇమ్రాన్ మృతిపై తమకు ఎవరిపైనా అనుమానాలు లేవని ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపినట్లు సమాచారం. పోలీసులు ఈ ఘటనను అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని, ప్రమాదం జరిగిన తీరుపై విచారణ జరుపుతున్నారు.