దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలతో ముగిశాయి. ఉదయం ఉత్సాహంగా లాభాలతో ప్రారంభమైనప్పటికీ, ఆ జోరును నిలబెట్టుకోలేకపోయాయి. అమెరికా విధించబోయే టారిఫ్ల గడువు (జులై 9) సమీపిస్తుండటంతో మదుపరులు అప్రమత్తత పాటించారు. లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో సూచీలు ఒత్తిడికి లోనయ్యాయి. ఫలితంగా సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలను మూటగట్టుకున్నాయి.
ఈనాటి ట్రేడింగ్లో బీఎస్ఈ సెన్సెక్స్ ఉదయం 83,790 పాయింట్ల వద్ద సానుకూలంగా ప్రారంభమైంది. ఒక దశలో 83,935 పాయింట్ల గరిష్ఠ స్థాయిని కూడా తాకింది. అయితే, మధ్యాహ్నం తర్వాత అమ్మకాల ఒత్తిడి పెరగడంతో లాభాలన్నీ ఆవిరైపోయాయి. చివరికి 287 పాయింట్ల నష్టంతో 83,409 వద్ద ముగిసింది. అదేవిధంగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ సైతం 88 పాయింట్లు కోల్పోయి, కీలకమైన 25,500 మార్కు దిగువన 25,453 వద్ద స్థిరపడింది.
మార్కెట్ల పతనానికి హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎల్ అండ్ టీ, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్ వంటి ప్రధాన షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడం ముఖ్య కారణంగా నిలిచింది. సెన్సెక్స్-30 సూచీలో బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, ఎల్&టీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బీఈఎల్ షేర్లు ఎక్కువగా నష్టపోయిన వాటి జాబితాలో ఉన్నాయి. మరోవైపు, టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ట్రెంట్, మారుతీ సుజుకీ షేర్లు లాభపడి మార్కెట్లకు కొంత అండగా నిలిచాయి.
డాలరుతో రూపాయి మారకం విలువ 85.68 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 67.70 డాలర్లుగా ఉండగా, బంగారం ధర ఔన్సుకు 3,352 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.