లీడ్స్ టెస్టు.. తొలి రోజు భార‌త్‌దే.. గిల్, జైస్వాల్ శతకాల మోత

V. Sai Krishna Reddy
3 Min Read

ఇంగ్లండ్ గడ్డపై జరుగుతున్న అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ తొలి టెస్టు మొదటి రోజే భారత యువ బ్యాటింగ్ సత్తా చాటింది. హెడింగ్లీ మైదానంలో కెప్టెన్‌గా తన తొలి టెస్టు ఆడుతున్న శుభ్‌మన్ గిల్ (127 నాటౌట్), యువ సంచలనం యశస్వి జైస్వాల్ (101) అద్భుత శతకాలతో చెలరేగగా, వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ (65 నాటౌట్) దూకుడైన అర్ధశతకంతో వారికి తోడయ్యాడు. దీంతో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 85 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 359 పరుగుల భారీ స్కోరు సాధించింది.

ముందుగా బ్యాటింగ్ ప్రారంభించిన భారత్‌కు యశస్వి జైస్వాల్, కేఎల్‌ రాహుల్ శుభారంభం అందించారు. ముఖ్యంగా జైస్వాల్.. ఇంగ్లండ్ పేసర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. ఆఫ్-సైడ్‌లో కళ్లు చెదిరే కట్ షాట్లు, డ్రైవ్‌లతో అలరించాడు. మరోవైపు రాహుల్ కూడా అద్భుతమైన కవర్ డ్రైవ్‌లతో ఆకట్టుకున్నాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 91 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

అయితే, బ్రైడన్ కార్స్ బౌలింగ్‌లో అనవసరపు షాట్‌కు ప్రయత్నించి రాహుల్ (42) ఫస్ట్ స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి తీవ్ర నిరాశతో వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అరంగేట్ర ఆటగాడు సాయి సుదర్శన్ (0) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో డ‌కౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో భారత్ లంచ్ విరామానికి రెండు కీలక వికెట్లు కోల్పోయి కాస్త ఇబ్బందుల్లో పడినట్లు కనిపించింది.

అయితే, లంచ్ విరామం తర్వాత కెప్టెన్ గిల్, యశస్వి జైస్వాల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ ఇంగ్లండ్ బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా పూర్తి ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా బంతి పాతబడటం ఇంగ్లండ్ బౌలర్ల దాడిలో పదును తగ్గడం వీరికి కలిసొచ్చింది. గిల్ చూడచక్కని డ్రైవ్‌లు, ఫ్లిక్‌లతో పరుగులు రాబట్టగా, జైస్వాల్ తనదైన శైలిలో ఫ్రంట్-ఫుట్ డ్రైవ్‌లు, బ్యాక్-ఫుట్ కట్‌లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.

ఈ క్రమంలో జైస్వాల్ 157 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఇది అతనికి ఇంగ్లండ్ గడ్డపై తొలి టెస్టు సెంచరీ కాగా, మొత్తంగా ఐదోది. సెంచరీ అనంతరం దూకుడు పెంచిన జైస్వాల్‌ను టీ విరామం తర్వాత బెన్ స్టోక్స్ అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. గిల్-జైస్వాల్ జోడీ మూడో వికెట్‌కు 129 పరుగుల విలువైన భాగస్వామ్యం అందించింది.

జైస్వాల్ నిష్క్రమణ అనంతరం క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్, తనదైన దూకుడైన ఆటతీరుతో ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మరోవైపు నిలకడగా ఆడుతున్న గిల్, కెప్టెన్‌గా తన తొలి టెస్టులోనే శతకం పూర్తి చేసుకుని చరిత్ర సృష్టించాడు. 175 బంతుల్లో 127 పరుగులు చేసిన గిల్, ఈ ఘనత సాధించిన ఐదో భారత కెప్టెన్‌గా నిలిచాడు. విరాట్ కోహ్లీ తర్వాత ఈ జాబితాలో చేరిన ఆటగాడు గిల్ కావడం విశేషం.

పంత్ కూడా 102 బంతుల్లో 65 పరుగులు చేసి అజేయంగా నిలవడమే కాకుండా, టెస్టుల్లో 3000 పరుగుల మైలురాయిని కూడా అందుకున్నాడు. గిల్, పంత్ జోడి అజేయంగా నాలుగో వికెట్‌కు 32.3 ఓవర్లలో 138 పరుగులు జోడించి, తొలి రోజే మ్యాచ్‌పై భారత్‌కు పూర్తి పట్టు లభించేలా చేసింది.

ఇంగ్లండ్ బౌలర్లు రోజంతా భారత బ్యాటర్లను అడ్డుకోవడంలో విఫలమయ్యారు. కెప్టెన్ బెన్ స్టోక్స్ రెండు వికెట్లు పడగొట్టగా, బ్రైడన్ కార్స్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. మిగతా బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. మొత్తం మీద తొలి రోజు ఆట పూర్తిగా భారత బ్యాటర్ల ఆధిపత్యంతో ముగిసింది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *