రేవంత్ రెడ్డి తన ఇంట్లోని టాయిలెట్‌ను తానే శుభ్రం చేసుకుంటున్నారా: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్న

V. Sai Krishna Reddy
2 Min Read

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఇంట్లోని టాయిలెట్‌ను తనే శుభ్రం చేసుకుంటున్నారా? మీ మంత్రులు కూడా వారి ఇళ్లలోని టాయిలెట్లను వారే కడుగుతున్నారా?” అని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. ఎస్సీ సంక్షేమ గురుకులాల్లో విద్యార్థులతో టాయిలెట్లు కడిగిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఆయన శనివారం తెలంగాణ భవన్‌లో విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు.

“ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఇంట్లోని టాయిలెట్‌ను తనే శుభ్రం చేసుకుంటున్నారా? మీ మంత్రులు కూడా వారి ఇళ్లలోని టాయిలెట్లను వారే కడుగుతున్నారా?” అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు వారి టాయిలెట్లను వారే శుభ్రం చేసుకుంటే తప్పేంటని ఒక ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించడాన్ని ప్రవీణ్ కుమార్ తీవ్రంగా తప్పుబట్టారు. “ఆ అధికారి పిల్లలు చదివే స్కూళ్లలో కూడా వారే టాయిలెట్లు కడుగుతున్నారా?” అని ఆయన నిలదీశారు.

ఎస్సీ వర్గాల పట్ల ఐఏఎస్ అధికారిణి అలుగు వర్షిణి వివక్ష చూపుతున్నారని ఆరోపిస్తూ, ఆమెను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గురుకులాల పరిస్థితి అధోగతి పాలైందని, ఎంతోమంది పేద విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

“రేవంత్ రెడ్డి, దమ్ముంటే రాష్ట్రవ్యాప్తంగా అందరూ వారి టాయిలెట్లను వారే కడుక్కోవాలని ఒక జీవో విడుదల చేయండి” అని ప్రవీణ్ కుమార్ సవాల్ విసిరారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ విద్యార్థులు ఇంజినీర్లు, డాక్టర్లు కావాలనే సదుద్దేశంతో గురుకులాలను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. కానీ, ప్రస్తుత ప్రభుత్వం సంపన్న వర్గాల పిల్లలకు ఒకలా, పేద పిల్లలకు మరోలా నిబంధనలు పెడుతోందని ఆరోపించారు.

గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలను మూసివేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐఏఎస్ అధికారిణి అలుగు వర్షిణి కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. ఇంటిగ్రేటెడ్ పాఠశాలల పేరుతో ముఖ్యమంత్రి ఒక పెద్ద స్కామ్‌కు తెరలేపుతున్నారని, ఆ పాఠశాలల నిర్మాణ పనులను తన అనుచరులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో గురుకులాల్లో సమ్మర్ క్యాంపులు నిర్వహించేవారని, రేవంత్ రెడ్డి పాలనలో వాటిని రద్దు చేశారని అన్నారు.

అందాల పోటీలకు హాజరైన వారికి 30 తులాల బంగారం బహుమతిగా ఇవ్వడానికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. పేద పిల్లల చదువుకు మాత్రం ప్రభుత్వం దగ్గర బడ్జెట్ ఉండదా అని నిలదీశారు. ప్రభుత్వం పేద విద్యార్థుల విద్యపై శ్రద్ధ చూపడం లేదని, వారి భవిష్యత్తుతో ఆడుకుంటోందని ఆయన మండిపడ్డారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *