ప్రపంచంలోనే తొలి ఏఐ ఆసుపత్రి… సౌదీ అరేబియాలో ప్రారంభం

V. Sai Krishna Reddy
3 Min Read

వైద్య రంగంలో సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. మనుషులకు బదులుగా యంత్రాలే రోగ నిర్ధారణ చేసి, చికిత్స అందించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని సౌదీ అరేబియాలో జరుగుతున్న ఓ ప్రయోగం నిరూపిస్తోంది. ప్రపంచంలోనే తొలిసారిగా, కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ – ఏఐ) ఆధారంగా రోగులకు వైద్య సేవలు అందించే క్లినిక్ సౌదీ అరేబియాలో ప్రారంభమైంది. ఈ వినూత్న ప్రయత్నం వైద్య చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోనుంది.

సౌదీ అరేబియాలోని తూర్పు ప్రావిన్స్‌ అల్-అహ్సాలో గత నెలలో ఈ ఏఐ క్లినిక్ ప్రయోగాత్మకంగా ప్రారంభమైంది. చైనాకు చెందిన వైద్య సాంకేతిక సంస్థ సిన్యి ఏఐ, సౌదీ అరేబియాకు చెందిన అల్మూసా హెల్త్ గ్రూప్ తో కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి. ‘లీడర్స్’ మ్యాగజైన్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ క్లినిక్‌లో రోగులు తమ సమస్యలను ముందుగా ఏఐ డాక్టర్‌కు వివరిస్తారు. ఆ తర్వాత అవసరమైతే మానవ వైద్యులు రంగంలోకి దిగుతారు.

ఏఐ క్లినిక్ ఎలా పనిచేస్తుంది?
ఈ క్లినిక్‌కు వచ్చిన రోగులు ముందుగా ‘డాక్టర్ హువా’ (Dr Hua) అనే ఏఐ డాక్టర్‌తో మాట్లాడతారు. ఇందుకోసం వారికి ఒక టాబ్లెట్ కంప్యూటర్ ఇస్తారు. రోగులు తమకున్న ఆరోగ్య సమస్యలు, లక్షణాలను టాబ్లెట్ ద్వారా ఏఐ డాక్టర్‌కు వివరిస్తారు. అచ్చం నిజమైన డాక్టర్ లాగే, ఈ ఏఐ డాక్టర్ కూడా రోగులను మరిన్ని ప్రశ్నలు అడుగుతుంది. మానవ సహాయకుల సాయంతో రోగి శరీర ఉష్ణోగ్రత, ఇతర డేటా, చిత్రాలను సేకరించి విశ్లేషిస్తుంది.

ఈ సంప్రదింపుల ప్రక్రియ పూర్తయిన తర్వాత, ‘డాక్టర్ హువా’ ఒక చికిత్సా ప్రణాళికను సిద్ధం చేస్తుంది. అయితే, ఈ ప్రణాళికను మానవ వైద్యుడు క్షుణ్ణంగా సమీక్షించి, ఆమోదముద్ర వేసిన తర్వాతే రోగికి చికిత్స ప్రారంభిస్తారు. ఒకవేళ ఏఐ గుర్తించలేని అత్యవసర పరిస్థితులు తలెత్తితే, మానవ వైద్యులు అందుబాటులో ఉండి సేవలందిస్తారు. అంటే, ఏఐ డాక్టర్లు ప్రాథమికంగా రోగ నిర్ధారణ, చికిత్సా సూచనలు చేసినప్పటికీ, తుది నిర్ణయం మానవ వైద్యులదే. వారిని ‘భద్రతా పర్యవేక్షకులు’గా (సేఫ్టీ గేట్‌కీపర్స్) సిన్యి ఏఐ సంస్థ అభివర్ణించింది.

షాంఘై కేంద్రంగా పనిచేస్తున్న సిన్యి ఏఐ సంస్థ ఒక ప్రకటనలో, “ఏఐ క్లినిక్ అనేది ఒక వినూత్న వైద్య సేవల వ్యవస్థ. ఇక్కడ ఏఐ డాక్టర్లు రోగిని ప్రశ్నించడం దగ్గర నుంచి మందులు సూచించడం వరకు పూర్తి వైద్య కార్యకలాపాలను స్వతంత్రంగా నిర్వహిస్తారు. మానవ వైద్యులు రోగ నిర్ధారణ, చికిత్స ఫలితాలను సమీక్షించే భద్రతా పర్యవేక్షకులుగా వ్యవహరిస్తారు” అని తెలిపింది.

ప్రస్తుత సేవలు, భవిష్యత్ ప్రణాళికలు
ప్రస్తుతానికి, ఈ ఏఐ డాక్టర్ శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు మాత్రమే కన్సల్టేషన్ అందిస్తోంది. ఇందులో ఉబ్బసం (ఆస్తమా), గొంతు నొప్పి (ఫేరింజైటిస్) వంటి సుమారు 30 రకాల వ్యాధులు ఉన్నాయి. త్వరలోనే ఈ ఏఐ డాక్టర్ డేటాబేస్‌ను విస్తరించి, శ్వాసకోశ, జీర్ణకోశ, చర్మ సంబంధిత వ్యాధులతో కలిపి మొత్తం 50 రకాల వ్యాధులకు సేవలు అందించాలని సిన్యి ఏఐ లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ పైలట్ ప్రోగ్రామ్ ద్వారా సేకరించిన రోగ నిర్ధారణ డేటాను సౌదీ అధికారులకు సమర్పిస్తారు. రాబోయే 18 నెలల్లో దీనికి ఆమోదం లభించవచ్చని అంచనా. ప్రస్తుత ట్రయల్‌కు ముందు నిర్వహించిన పరీక్షా దశలో, ఈ సాంకేతికతలో తప్పుల శాతం కేవలం 0.3 శాతంగా ఉందని సిన్యి ఏఐ పేర్కొంది.

సిన్యి ఏఐ సీఈఓ జాంగ్ షావోడియన్ మాట్లాడుతూ, “గతంలో ఏఐ కేవలం వైద్యులకు సహాయకారిగా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు మేము ప్రయాణంలో చివరి అడుగు వేస్తున్నాం. ఏఐ నేరుగా రోగ నిర్ధారణ చేసి, చికిత్స అందించేలా చేస్తున్నాం” అని వివరించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *