తెలంగాణ కాంగ్రెస్ లో మంత్రివర్గ విస్తరణ ముసలం పుట్టిస్తోంది. ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు అవుతున్నా, మంత్రివర్గాన్ని విస్తరించకపోవడంపై ఎమ్మెల్యేలు ముఖ్యంగా ఆశావహులు నిరసన బాట ఎంచుకుంటున్నారు. తమకు మంత్రి పదవుల ఆశచూపి మోసం చేస్తున్నారని పార్టీ హైకమాండ్ పై మండిపడుతున్నారు. ఇప్పటివరకు పలువురు సీనియర్లు నిరసన గళం విప్పగా, తాజాగా ముదిరాజ్ సంఘం పేరిట కొంతమంది ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి అభిమానులు రాసిన లేఖ వైరల్ అవుతోంది. దీంతో కాంగ్రెస్ లో మంత్రివర్గ విస్తరణ అంశం చినికి చినికి గాలివానగా మారుతోందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నెల తొలివారంలోనే రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరిస్తామని కాంగ్రెస్ హైకమాండ్ లీకులిచ్చింది. ఇప్పటికే ఈ విషయంపై అనేకసార్లు చర్చించిన కాంగ్రెస్ పార్టీ.. కాబోయే మంత్రుల ఎంపికపై ఓ నిర్ణయానికి రాలేకపోతోంది. దీంతో విడతల వారీగా వాయిదాలు వేస్తూనే వస్తోంది. చివరి ముహూర్తమంటూ చెప్పిన ఈ నెల తొలివారం కూడా వాయిదాతో ముగిసిపోయింది. ఈ పరిస్థితుల్లో తాము జీవితంలో మంత్రులు కాలేమా? అంటూ ఆశావహులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా గత ఎన్నికల సమయంలో పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవులిస్తామని కొందరికి ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది
ఇలా కాంగ్రెస్ హామీ ఇచ్చిన వారిలో ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వివేక్, మల్ రెడ్డి రంగారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. రకరకాల సామాజిక, ప్రాంతీయ సమీకరణలతో వీరికి మంత్రి పదవులు ఇవ్వలేకపోతున్నామని నచ్చజెప్పేందుకు కాంగ్రెస్ విఫలయత్నమవుతోంది. దీంతో వారి నుంచి రోజురోజుకు ఒత్తిడి ఎక్కువవుతోంది. తమకు మంత్రి పదవులు ఇవ్వకపోతే తడాఖా చూపుతానంటూ ఎమ్మెల్యే మల్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి తదితరులు బహిరంగంగా వార్నింగులిస్తున్నారు
ఇక రాష్ట్రంలోని ప్రధాన సామాజికవర్గమైన ముదిరాజులకు మంత్రివర్గంలో అవకాశమిస్తామని సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా ప్రకటించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఏకైక ముదిరాజ్ నేతగా మక్తల్ శాసనసభ్యుడు వాకాటి శ్రీహరికి బెర్తు దాదాపు ఖరారు అన్నారు. అయితే విస్తరణ ఆలస్యం అవడం వల్ల ముదిరాజ్ నేత మంత్రి కాలేకపోతున్నారని ఆ సామాజికవర్గం ఆవేదన వ్యక్తం చేస్తోంది. తాజాగా వాకాటిని మంత్రిని చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డిని దూషిస్తూ ముదిరాజ్ సామాజికవర్గం నుంచి కొందరు వ్యక్తులు రాసిన లేఖ ఆన్ లైన్ లో వైరల్ అవుతోంది. ఎమ్మెల్యే టికెట్ కోసం రూ.10 కోట్లు, మంత్రి పదవి కోసం రూ.100 కోట్లు ఖర్చు పెట్టామని ఆ లేఖలో పేర్కొనడం సంచలనంగా మారింది