ప్రముఖ పర్యావరణ ప్రేమికుడు వనజీవి రామయ్య ఈ ఉదయం గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. మొక్కలు నాటడమే పరమావధిగా భావించిన రామయ్య మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. దరిపల్లి రామయ్య గారు సుస్థిరత కోసం గళం వినిపించిన వ్యక్తిగా గుర్తుండిపోతారని కీర్తించారు. లక్షలాది చెట్లను నాటడానికి, వాటిని రక్షించడానికి ఆయన తన జీవితాన్ని అంకితం ఇచ్చారని కొనియాడారు.
“రామయ్య అవిశ్రాంత కృషి ప్రకృతి పట్ల గాఢమైన ప్రేమనూ, భవిష్యత్ తరాల పట్ల బాధ్యతను ప్రతిబింబిస్తాయి. ఆయన చేసిన కృషి మన యువతలో మరింత సుస్థిరమైన హరిత గ్రహాన్ని నిర్మించాలనే తపనను ప్రేరేపిస్తూనే ఉంటుంది. ఈ విషాద సమయంలో రామయ్య కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను… ఓం శాంతి” అంటూ మోదీ తన సంతాప సందేశం వెలువరించారు.