రాష్ట్రంలో రాజకీయాలు ఇంకా ఎన్నికల వాసనలను వదిలించుకున్నట్టుగా కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఎలాంటి రాజకీయాలు చేశారో.. ఇప్పుడు కూడా ఫక్తు అలాంటి రాజకీయాలే కనిపిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. కానీ, రాష్ట్రంలో మరో నాలుగు సంవత్సరాల వరకు కూడా.. ఎన్నికలు లేవు. ఈ విషయం మరిచిపోయారో.. లేక ఉద్దేశ పూర్వకంగానో.. నాయకులు చేస్తున్న కార్యక్రమాలు.. ఫక్తు రాజకీయాలనే తలపిస్తున్నాయన్న వాదన బలంగా వినిపిస్తోంది.
రాష్ట్రంలో సమస్యలపై ఏ ఒక్క పార్టీకానీ.. ఏ ఒక్క నాయకుడు కానీ ప్రస్తావించడం లేదు. అధికారలో ఉన్నవారు.. లేని వారు.. ఓటు బ్యాంకు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పుకొనే వారు కూడా.. ఈ సమస్యలపై దృష్టి పెట్టడం లేదన్న విమర్శలు కూడా వస్తున్నాయి. 1) వేసవి. రాష్ట్రంలో వేసవి తీవ్రత పెరుగుతోంది. దీంతో నీటి సదుపాయాలు లేక.. కర్నూలు, అనంతపురం వంటి.. కరువు జిల్లాలే కాదు.. గుంటూరు, కృష్ణాజిల్లాల్లో కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై ఎవరూ స్పందించడం లేదు.
2) తాజాగా కేంద్ర ప్రభుత్వం రూ.50 చొప్పున గ్యాస్ సిలిండర్ ధరలు పెంచింది. అదేంటో కానీ.. ఒక్క పార్టీ కూడా.. దీనిని వ్యతిరేకిస్తూ.. చిన్న ప్రకటన కూడా చేయలేదు. మరి ప్రజల కోసం ఉన్నామని.. వారి కష్టాలు పంచుకుంటున్నామని చెప్పే పార్టీలు ఎందుకు మౌనంగా ఉంటున్నాయో.. అర్ధం కావడం లేదు. కనీసం.. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా.. ఒక్క చిన్న ప్రకటన కూడా చేయలేదు. పైగా..పీసీసీ చీఫ్ షర్మిల.. మరోసారి తన సోదరుడు, వైసీపీ అధినేత జగన్‌పై వ్యక్తిగత విమర్శలు చేశారు
3) ధరలపెరుగుదల. అమెరికా విధించిన సుంకాల కారణంగా.. నిత్యావసరాల ధరలు గత వారం నుంచి పెరిగిపోయాయన్నది వినియోగదారులు చెబుతున్న మాట. దీంతో ఆదాయాలు చాలక.. వచ్చింది సరిపోక.. తల్లడిల్లుతున్నారు. ఈ విషయాన్ని కూడా.. పార్టీలు ఎక్కడా పట్టించుకున్న పాపాన పోలేదు. అధికారంలో ఉన్నవారు .. సరే, కానీ, విపక్షంలో ఉన్న వైసీపీ కూడా.. ఎన్నికలు వస్తున్నాయి.. అందరూ గెట్ రెడీ అంటూ.. ప్రకటనలు చేస్తున్నదే తప్ప.. ప్రజల సమస్యలపై పోరాటమే లేకుండా పోయింది. ఇక, కాంగ్రెస్ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. మరి ప్రజల కోసం.. ఎవరు పోరాటం చేస్తారో చూడాలి.