కంచ గచ్చిబౌలి, హెచ్‌సీయూ పరిసర ప్రాంతాల్లో పర్యావరణ విధ్వంసం జరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 400 ఎకరాలకు సంబంధించిన భూ వివాదం నేపథ్యంలో… కేటీఆర్ నేడు తెలంగాణ ప్రజానీకానికి, విద్యార్థి లోకానికి, పర్యావరణవేత్తలకు బహిరంగ లేఖ రాశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఆయన తీవ్రంగా విమర్శించారు. హెచ్‌సీయూ భూముల వ్యవహారంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తాయని ఆందోళన వెలిబుచ్చారు.
దాదాపు 400 ఎకరాల పచ్చని భూమి, వందలాది వృక్ష జాతులు, పక్షులు, జంతువుల ఆవాసం ప్రమాదంలో పడిందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆర్థిక లబ్ధి కోసం పర్యావరణాన్ని నాశనం చేస్తోందని దుయ్యబట్టారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు అడవిని కాపాడుకోవడానికి శాంతియుతంగా చేస్తున్న పోరాటానికి కేటీఆర్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. విద్యార్థులపై నిందలు వేయడం, యూనివర్సిటీని తరలిస్తామని బెదిరించడం ప్రభుత్వ రియల్ ఎస్టేట్ ధోరణికి నిదర్శనమని మండిపడ్డారు. ఇది ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమని విమర్శించారు.
ఎకో పార్క్ పేరుతో ప్రభుత్వం సరికొత్త మోసానికి తెరలేపిందని కేటీఆర్ ఆరోపించారు. అడవిని కాపాడాల్సింది పోయి, భూమిని ఆక్రమించడానికి కుట్ర చేస్తోందని విమర్శించారు. నిరసనలు కొనసాగితే హెచ్‌సీయూను వేరే ప్రాంతానికి తరలిస్తామని ప్రభుత్వం చేస్తున్న హెచ్చరికలను ఆయన ఖండించారు. పర్యావరణ పరిరక్షణ కోసం పోరాడుతున్న విద్యార్థులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
గచ్చిబౌలి, హెచ్‌సీయూలను కాపాడతామని బీఆర్‌ఎస్ పార్టీ తరపున కేటీఆర్ హామీ ఇచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించి, భూముల అమ్మకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పర్యావరణ పరిరక్షణ విషయంలో ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఆయన హెచ్చరించారు.