హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ కేంద్రంగా జమ్మూకశ్మీర్-శ్రీనగర్ నుంచి వందల కొద్దీ పేదవాళ్లు జకాత్ తీసుకోవడానికి ప్రతి సంవత్సరం వలస వస్తూ ఉంటారు. అలాగే కొన్ని ఇతర రాష్ట్రాల నుంచి కొంత మంది యువకులు బాబాలు, ఫకీరు వేషాలు వేసుకుని జకాత్ పేరుతో అడుక్కునే ప్రయత్నాలు చేస్తున్నారు. జకాత్ అంటే ముస్లింలు చెల్లించే ధార్మిక ట్యాక్స్. ప్రధానంగా రంజాన్ మాసంలో ఈ జకాత్ అనేది ఎక్కువగా వినబడుతుంది. అర్హత కలిగిన ప్రతి ముస్లిం తప్పకుండా విధిగా చెల్లించాల్సిన ట్యాక్స్‌నే జకాత్ అంటారు. కాకపోతే ఈ ట్యాక్స్ ప్రభుత్వానికి కాదు.. పేదలకు చెల్లించాలి. ఇలా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కొందరు జకాత్ పేరుతో ముష్టి ఎత్తుకోవడం సాధారణంగా మారిపోయింది. దీంతో ఈ ప్రాంతంలో స్థానికంగా ఉన్న కొందరు బిచ్చగాళ్లు ముష్టి అడుక్కోడానికి భయపడుతున్నారు.
అయితే.. మత విశ్వాసాల ప్రకారం జకాత్ చెల్లిస్తున్నప్పటికీ.. పాతబస్తీలోని కొందరు ముస్లిం సోదరులకు ఇది సమస్యగా పరిణమిస్తోంది. కాళ్లు, చేతులు అన్నీ బాగున్నప్పటికీ ఇలా ఫకీరు వేషధారణలో ముష్టి ఎందుకు అడుక్కోవాలని ప్రశ్నిస్తున్నారు. మతం పేరు చెప్పుకుని, వేరే రాష్ట్రాల నుంచి వచ్చి మరీ ఇలా బాబాల వేషం కట్టి ఎందుకు మీరు ముష్టి అడుక్కుంటున్నారంటూ వారిని నిలదీస్తున్నారు. పాతబస్తీలోని చాలా ప్రాంతాలలో ఇలాంటి వలస వచ్చిన ఫకీర్లు కనిపిస్తుండడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, పోలీసు యంత్రాంగం స్పందించి మతం పేరుతో అడుక్కుంటున్న ఇలాంటి బాబాల నిజస్వరూపాన్ని బయటపెట్టాలని కోరుతున్నారు.