వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లను వైట్ హౌస్‌కు ఎప్పుడు ఆహ్వానిస్తారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఆయన స్పందించారు. స్పేస్ ఎక్స్ వ్యోమనౌకలో బుధవారం తెల్లవారుజామున వారు సురక్షితంగా భూమికి చేరుకున్నారు. యావత్ ప్రపంచం వీరికి సాదర స్వాగతం పలికింది.
ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడిని మీడియా ప్రశ్నించింది. ట్రంప్ స్పందిస్తూ, వారు ఇన్నాళ్లు అంతరిక్షంలో ఉన్నారని, అక్కడ మన శారీరక స్థితిలో చాలా మార్పులు ఉంటాయని తెలిపారు. శరీరం తేలికగా మారుతుందని, గురుత్వాకర్షణ శక్తి ఉండదని తెలిపారు. అలాంటి పరిస్థితుల నుంచి వారు భూమికి చేరుకున్నారని తెలిపారు.
ఇక్కడి వాతావరణానికి వారు అలవాటుపడటం అంత సులభం కాదని అన్నారు. అందుకే వారిని ఇప్పుడే వైట్ హౌస్‌కు ఆహ్వానించడం లేదని స్పష్టం చేశారు. వారిని ఆహ్వానించడానికి ఇంకా సమయం ఉందని తెలిపారు. వారి పరిస్థితి మెరుగుపడిన తర్వాత ఓవల్ ఆఫీసుకు ఆహ్వానిస్తానని తెలిపారు.