పర్వతగిరి, మార్చి 18 (ప్రజాజ్యోతి):
సెల్ ఫోన్ లైట్ తో ఎంతో ఇబ్బంది పడుతూ.. దహన సంస్కారాలు నిర్వహించాల్సి వచ్చింది. అధికారుల నిర్లక్ష్యం తో ఆఖరి ఘట్టంలో ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం లక్షలు వెచ్చించి నిర్మించిన వైకుంఠ దామాల్లో వసతులు కల్పించక పోవటంతో.. జనాల్లో అధికారుల పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతుంది.
జిల్లా పంచాయతి అధికారి ఆదేశాల మేరకు ఈనెల 10న పర్వతగిరి మండల పంచాయతీ అధికారి పాక శ్రీనివాస్ పర్వతగిరి, దౌలత్ నగర్, మల్యా తండా.. వైకుంఠ ధామాలను సంబంధిత గ్రామపంచాయతీ కార్యదర్శులతో కలిసి సందర్శించి.. పారిశుధ్యం, నీటివసతి, విద్యుత్.. వసతులు కల్పించాలని ఆదేశించిన విషయం తెలిసినదే.. మంగళవారం పర్వతగిరి మండల కేంద్రంలో ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మరణించిన సందర్భంగా సాయంత్రం దాదాపు 7 గంటల సమయంలో దహన సంస్కారాలను సెల్వె ఫోన్లు వెలుగులతో నిర్వహించారు. విద్యుత్తు సౌకర్యం లేనందున అనుకోని ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరు వహిస్తారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ డిప్యూటీ సీఎం, ప్రస్తుత స్టేషన్గన్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సొంత గ్రామంలో ఈ విధంగా ఉందంటే మిగతా గ్రామాలలో ఏ విధంగా ఉంటుందోనని వచ్చిన బంధువులు ముక్కు మీద వేలు వేసుకొని ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచారు. అనంతరం చెరువులో స్నానాలు చేయాలంటే అనుకోని ప్రమాదం జరిగితే ఎలా అని భయభ్రాంతులకు గురై స్నానాలు చేయడానికి నానా ఇబ్బందులు పడ్డారు. బాగా చీకటి అవడంతో మెట్ల దగ్గర కానీ దిగే దగ్గర గాని జారీపడి ప్రమాదం సంభవిస్తే బాధ్యులు ఎవరు వహిస్తారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విధుల పట్ల అలసత్వం వహిస్తున్న ఇలాంటి అధికారులను తక్షణమే బదిలీ చేయాలని గ్రామస్తులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.