యాదగిరిగుట్ట ఆలయానికి ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. దేవాదాయ చట్ట సవరణ బిల్లుపై శాసనసభలో చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పద్దెనిమిది మంది సభ్యులతో యాదగిరిగుట్ట ట్రస్టు బోర్డు (వైటీడీ) ఉంటుందని వెల్లడించారు. ఈ బోర్డు పదవీ కాలాన్ని రెండు సంవత్సరాలుగా నిర్ణయించామని, బోర్డు చైర్మన్, సభ్యులకు ఎలాంటి జీతభత్యాలు ఉండవని స్పష్టం చేశారు.
వైటీడీకి బడ్జెట్ ఆమోదం ప్రభుత్వం ద్వారా జరుగుతుందని మంత్రి తెలిపారు. ఐఏఎస్ అధికారి ఈవోగా ఉంటారని వెల్లడించారు. వైటీడీ బోర్డు విద్యా సంస్థలను స్థాపించవచ్చు, నిర్వహించవచ్చని తెలిపారు. యాదగిరిగుట్టలో ఆధ్యాత్మిక, వేద పాఠశాలలను స్థాపించుకోవచ్చని తెలిపారు.
గతంలో యాదగిరిగుట్ట భక్తులకు సరైన వసతులు లేవని ఆమె అన్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ప్రభుత్వం వసతులను ఏర్పాటు చేసిందని తెలిపారు. యాదగిరిగుట్టను మరింత మెరుగుపరిచేందుకే పాలక మండలిని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఏటా రూ. 100 కోట్ల ఆదాయం వచ్చే ఆలయాలు దేవాదాయ శాఖ పరిధిలోకి వస్తాయని ఆమె స్పష్టం చేశారు