జగదీశ్ రెడ్డికి ఇంకా అహంకారం తగ్గలేదు: కాంగ్రెస్ నేత పటేల్ రమేశ్ రెడ్డి

V. Sai Krishna Reddy
1 Min Read

బీఆర్ఎస్ అధికారం కోల్పోయినా ఆ పార్టీ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డికి అహంకారం ఇంకా తగ్గలేదని టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి అన్నారు. స్పీకర్ పట్ల ఆయన అవమానకరంగా మాట్లాడారని మండిపడ్డారు. అసెంబ్లీ నుండి తనను అన్యాయంగా సస్పెండ్ చేశారని జగదీశ్ రెడ్డి అనడం విడ్డూరమన్నారు. ఆయనకు దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు రావాలని సవాల్ చేశారు. ఈసారి ఆయనకు డిపాజిట్ కూడా దక్కదని అన్నారు.

గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, రాజీనామా చేసి వస్తే, ఎవరు చేసింది సరైనదో ప్రజలే తేల్చుతారని ఆయన అన్నారు. బీఆర్ఎస్ నాయకులు సభలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. స్పీకర్ పట్ల మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలను ఎవరు సమర్థించరని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్ష పాత్రను పోషిస్తూ ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ఆయన అన్నారు.

గతంలో రబ్బర్ చెప్పులు, డొక్కు స్కూటర్ మీద తిరిగిన జగదీశ్ రెడ్డికి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో ఓ నియంతలా వ్యవహరించి వేల కోట్ల రూపాయలను దోచుకున్నారని ఆరోపించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ 12 సీట్లకు 11 సీట్లలో ఓడిపోయిందని అన్నారు. జగదీశ్ రెడ్డి ఒక్కరే గెలిచారని గుర్తు చేశారు. ఇంకా అధికారంలో ఉన్నామనే అహంభావంతో ఆయన మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. స్పీకర్ పట్ల జగదీశ్ రెడ్డి ప్రవర్తించిన తీరుకు ఆయనను పూర్తి కాలం సభ నుంచి సస్పెండ్ చేయాలని అన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *