మార్చి 14న హోలి పండగ సందర్భంగా ఆయా రాష్ట్రాల ప్రజలు ఘనంగా జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు వాహనదారులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. హోలీ పండగ అయితే వాహనదారుల వార్నింగ్ ఏంటని అనుకుంటున్నారా..? పండగ సందర్భంగా పోలీసులు ప్రత్యేక నిఘా పెడుతున్నారు. హోలీ పండగ నేపథ్యంలో వాహనదారులు గుంపులు గుంపులుగా ర్యాలీగా వెళ్లడానికి అనుమతి లేదని, అలాగే వాహనాలపై వెళ్తూ మహిళలపై రంగులు వేస్తే కఠిన చర్యలు ఉంటాయని సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాష్ మొహంతి హెచ్చరించారు. ఈ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఉత్తర్వులు సైతం జారీ చేశారు. అలాగే అపరిచితులపై రంగులు చల్లుతూ అసౌకర్యం కలిగించవద్దని హెచ్చరించారు. గుంపులు గుంపులుగా వాహనాలపై వెళ్లడానికి అనుమతి లేదన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, అలాగే ప్రజలను ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉందని ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఆదేశాలు మార్చి 14 ఉదయం 6 గంటల నుంచి మార్చి 15 ఉదయం 6 గంటల వరకు అమలులో ఉంటాయన్నారు.
అలాగే హోలీ రోజున అన్ని మద్యం దుకాణాలు మూసివేయబడతాయని రాచకొండ పోలీస్ కమిషనర్ జి. సుధీర్ బాబు ఇటీవల ఒక ప్రకటనలో ప్రకటించారు. పండుగ స్ఫూర్తిని దెబ్బతీసే మద్యం సంబంధిత సంఘటనలను నివారించడానికి మార్చి 14న ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మూసివేత అమలులో ఉంటుందన్నారు.