ఈ క్రమంలో దేశంలో ఉన్న రెండు బలమైన రాజకీయ శిబిరాలలో తాను ఏ వైపు అన్నది జగన్ మాత్రమే తేల్చుకోవాలని అంటున్నారు. ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ ను దేశంలోని ఇండియా కూటమి పక్షాలు తమతో కలుపుకోవాలని చూస్తున్నాయి. ఎందుకంటే ఆయన ఎన్డీయే అయితే బయటకు తెలిసి లేరు. ఇక ఏపీలో చూస్తే ఎన్డీయేతో దోస్తీ పరోక్షంగా చేయాలని చూసినా పరిస్థితులు అయితే అనుకూలించేలా లేవు.
ఇంకా విడమరచి చెప్పుకోవాలంటే 2014 నుంచి 2019 మధ్య జగన్ అవసరం బీజేపీకి ఉండేది. ఏపీలో బాబుకు యాంటీగా మరో పార్టీని ప్రోత్సహించడం ద్వారా ఆయనను తన నియంత్రణలో ఉంచుకునే వ్యూహంలో భాగంగానే జగన్ ని చేరదీశారు తప్ప అందులో బీజేపీకి ప్రత్యేకించి జగన్ మీద వైసీపీ మీద వేరే ప్రత్యేక అభిమానాలు లేవు అన్నది ఒక విశ్లేషణగా చెబుతారు.
ఇక 2019 నాటికి బాబు ఎటూ ఎదురుతిరిగి ఎన్డీయే కూటమి నుంచి వెళ్ళిపోయారు, పైగా ఓటమి పాలు అయ్యారు. దాంతో 22 ఎంపీ సీట్లు ఉన్న జగన్ బీజేపీకి మరింత రాజకీయ అవసరం అయ్యారనుకోవాలి. ఇక 2024 నాటికి చూస్తే ఏపీలో మూడు పార్టీలు కలసి కూటమిని కట్టాయి. అందులో జనసేనతో బీజేపీకి మంచి బంధమే ఉంది. బాబు కాదంటే జనసేనతో ముందుకు సాగాలన్న వ్యూహం కూడా ఉంది. అంటే ఏపీలో పవన్ ఉన్నంతవరకూ జగన్ అవసరం అన్నది బీజేపీకి పడదు అని భావించాలి. పైగా పవన్ సినీ నటుడు, బలమైన సామాజిక నేపథ్యం ఉన్న వారు. బీజేపీ పట్ల విధేయత ఉంది. ఆయన కూడా హిందూత్వను అనుసరిస్తున్నారు. ఇలా ఎన్నో భావసారూప్యాలు కలగలసిన పవన్ తోనే బీజేపీ ప్రయాణం చేస్తుంది, ఏపీలో తన రాజకీయ గమ్యస్థానం చేరుకునేందుకు పవన్ తోనే బలమైన స్నేహ బంధాన్ని కొనసాగిస్తుంది అని అంటున్నారు