ఆగస్టులో విశాఖపట్నంలో విద్యామంత్రుల కాంక్లేవ్ నిర్వహిస్తామన్న మంత్రి
యూనివర్సిటీ అడ్మినిస్టేషన్‌కు ఏకీకృత చట్టం తెస్తామని వెల్లడి
కాలేజి నుంచి బయటకు వచ్చేసరికి ప్రతి విద్యార్థికి ఉద్యోగం సిద్ధంగా ఉండాలన్న మంత్రి
గత ప్రభుత్వ నిర్వాకంవల్ల విద్యా ప్రమాణాలు పడిపోయాయని వ్యాఖ్య
ప్రజాప్రతినిధుల చొరవతో పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన
శాసనసభలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేశ్
అధికారులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రుల సహకారంతో రాబోయే అయిదేళ్లలో ప్రపంచమంతా మనవైపు చూసేలా ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ తెస్తామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. విద్యాశాఖ బడ్జెట్ డిమాండ్స్ పై శాసనసభలో జరిగిన చర్చలో మంత్రి లోకేశ్ విద్యారంగ సమస్యలు, పరిష్కారాలు, సంస్కరణలపై సుదీర్ఘంగా ప్రసంగించారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక కష్టమైన విద్యాశాఖను కోరుకున్నానని, కేజీ టు పీజీ ప్రక్షాళన చేయాలని భావించానని అన్నారు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్‌లో 9నుంచి 3కు, క్విఎస్ టాప్ -100 ర్యాంకింగ్స్ లో ఏపీ వర్సిటీలు ఉండాలని సీఎం చెప్పారని తెలిపారు. విద్యామంత్రి అయ్యాక ఈ శాఖలో దారుణమైన పరిస్థితులను చూశానని, రాష్ట్రంలో గత ప్రభుత్వ నిర్వాకం కారణంగా 12 లక్షలమంది పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారని విమర్శించారు. గత ప్రభుత్వం ప్రభుత్వ విద్యకు సంబంధించి అనేక మాటలు చెప్పిందని, కానీ చేతల్లో అంతా డొల్లతనమేనని అన్నారు
జీవో 117పై ఇటీవల వర్క్ షాపు పెట్టినట్లు చెప్పారు. గత ప్రభుత్వ అస్తవ్యస్త పాలన వల్ల 10మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్న స్కూళ్లు 5507కు, 20 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్న స్కూళ్లు 13,720కి పెరిగినట్లు చెప్పారు. సింగిల్ టీచర్ స్కూల్స్ 30 శాతం అంటే 12,512కు పెరిగాయని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో డ్రాపవుట్ రేట్స్ ఆందోళనకరంగా ఉన్నట్లు చెప్పారు. రాష్ట్రంలో 12.5 శాతానికి వెళ్లాయని, రాష్ట్రవ్యాప్తంగా 7 నుంచి 8వ తరగతికి 47 వేల మంది ఆడపిల్లలు విద్యకు దూరమైనట్లు చెప్పారు. తాను విద్యామంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఎంతమంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని అధికారులను అడిగితే వారాలు, నెలల తర్వాత 33.40లక్షల మంది ఉన్నారని చెప్పారని గుర్తు చేసుకున్నారు. డ్రాప్ బాక్సు విధానం వల్ల సరైన సంఖ్య చెప్పలేదని, 17 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు కలిగిన దాదాపు లక్ష మంది పిల్లలు డ్రాప్ బాక్సులో ఉన్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో ఉద్దేశపూర్వకంగా గ్రాస్ రోల్‌మెంట్ రేషియో ఎక్కువగా చూపేందుకు ఇలా చేశారని ఆరోపించారు.
నాస్ సర్వేలో బట్టబయలైన వైసీపీ ప్రభుత్వ నిర్వాకం
‘నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే (నాస్ ) సర్వే రిపోర్టు ప్రకారం 2017లో థర్డ్ గ్రేడ్ లాంగ్వేజ్ లో ఎపి విద్యార్థులు దేశంలో నెం.1 స్థానంలో ఉండగా, 2021కి వచ్చేసరికి 27వస్థానానికి పడిపోయాం. టెన్త్ మ్యాథ్స్‌లో గతంలో ఒకటో స్థానంలో ఉండగా, గత ప్రభుత్వంలో 12వ స్థానానికి పడిపోయింది. సైన్స్ లో ఒకటో స్థానం నుంచి 15వ స్థానానికి, ఇంగ్లీషులో 4నుంచి 14వ స్థానానికి పడిపోయాం. ఫౌండేషన్ స్కిల్స్ పై అసర్ నివేదిక కూడా గత ప్రభుత్వ హయాంలో పాఠశాల విద్యలో డొల్లతనాన్ని బట్టబయలు చేసింది. అసర్ రిపోర్టు ప్రకారం 2018లో తెలుగుభాషకు సంబంధించి, గ్రేడ్-5 పిల్లలు గ్రేడ్ -2 చదవవడంపై పరీక్షించినపుడు 57 నుంచి 38 శాతానికి పడిపోయింది. గ్రేడ్-8 విద్యార్థులకు 2వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకాలు ఇచ్చి చదివించగా, 2018లో 78 శాతం మంది చదివితే, 2024లో 53 శాతానికి పడిపోయింది. 90 శాతం మంది 3వ తరగతి పిల్లలకు ఫౌండేషన్ న్యూమరసీ స్కిల్స్ లేవు.’ అని వెల్లడించారు.
ముందస్తు వ్యూహం లేకుండా సీబీఎస్ఈ పేరుతో హడావిడి
‘మాజీముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే జగన్ సీబీఎస్ఈ విషయంలో అనాలోచితంగా ప్రకటన చేశారు. ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా వెయ్యిపాఠశాలల్లో సీబీఎస్ఈ బోర్డు ఎగ్జామినేషన్ విధానాన్ని బలవంతంగా రుద్దారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వారికి మాక్ టెక్స్ట్ నిర్వహిస్తే 90 శాతం మంది విద్యార్థులు కనీసం ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యారు. అది చూశాక ఉపాధ్యాయులను ప్రిపేర్ చేసి, తర్వాత అమలు చేద్దామని నిర్ణయించి, సీబీఎస్ఈ విధానాన్ని మూడేళ్లకు వాయిదా వేశాను. రెండోది టోఫెల్ పేరుతో రూ. 59 కోట్లు వృథా చేశారు. మూడోది ఐబి కరిక్యులమ్.
అది చాలా కష్టతరమైన విధానం. అద్భుతమైన ఉపాధ్యాయులు, ట్రైనింగ్ ఉంటేనే పెద్దపెద్ద పాఠశాలల్లో దానిని అమలుచేస్తారు. ఐబి ప్రాథమిక నివేదిక కోసమే రూ.5 కోట్లు ఖర్చు చేశారు. గత అయిదేళ్లలో టీచర్లు ప్రాక్టికల్ సమస్యలు తెలియజెప్పేందుకు వెళితే విద్యాశాఖ కమిషనర్, సెక్రటరీ, మినిస్టర్ దొరికేవారు కాదు. ఉపాధ్యాయుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసి మద్యం షాపుల ముందు సెక్యూరిటీగా నిలబెట్టారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కుంటిసాకులతో 2022లో 1530మందిని ఏకపక్షంగా నిబంధనలకు విరుద్దంగా ట్రాన్స్ ఫర్ చేశారు. 45 అనవసరమైన యాప్‌లు పెట్టి, టీచర్లు విద్యాబోధనపై శ్రద్ధపెట్టలేని పరిస్థితికి తెచ్చారు. చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయులతో టాయ్ లెట్ ఫోటోలు తీయించారు.’ అని ధ్వజమెత్తారు.
స్కూళ్లలో మౌలిక వసతులను గాలికొదిలేశారు
ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాల కోసం 2018లో గంటా శ్రీనివాసరావు మంత్రిగా ఉన్నపుడు హామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మోడల్) ద్వారా స్కూల్ అప్ గ్రేడేషన్ ప్రాజెక్టు కింద నిధులు తెస్తే గత ప్రభుత్వం గాలికొదిలేసిందని ఆరోపించారు. నాడు-నేడు విషయంలో గొప్పలు చెబుతున్నారని, వాస్తవం ఏమిటంటే నాడు-నేడు ఫేజ్-1లో రూ. 880 కోట్ల పనులు, ఫేజ్-2 లో రూ.4 వేల కోట్ల పనులు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయని మంత్రి తెలిపారు. మరో విచిత్రమైన విషయమేమిటంటే ప్రభుత్వ స్కూళ్లలో రంగులు వేసిన హడావిడి చేసిన చోట జీవో 117 జిఓ కారణంగా పాఠశాలలు మూతపడ్డాయన్నారు. సైంటిఫిక్ విధానం లేకుండా అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టారని విమర్శించారు. 2019-24 నడుమ కేంద్రప్రభుత్వం సమగ్ర శిక్ష కింద 900 కోట్లు సివిల్ వర్క్స్ కు కేటాయిస్తే రాష్ట్రం వాటా ఇవ్వకుండా కాలయాపన చేయడంతో ఆ నిధులు మురిగిపోయాయని మంత్రి అన్నారు.