తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 21వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షకు సంబంధించిన పదో తరగతి హాల్ టికెట్లు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని, పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు వాటిని డౌన్‌లోడ్ చేసుకోవాలని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు ఎ కృష్ణా రావు సూచించారు. అలాగే ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు నుంచి కూడా విద్యార్ధులు హాల్ టికెట్లను పొందొచ్చని పేర్కొన్నారు. ఒక వేళ ఏదైనా కారణాలతో పాఠశాలల యాజమాన్యాలు హాల్‌టికెట్లు ఇవ్వడానికి నిరాకరిస్తే విద్యార్థులు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని పరీక్షలు రాయవచ్చని పేర్కొన్నారు. పరీక్షలకు సంబంధించి ఏమైనా సమస్యలు, సందేహాలుంటే 040-23230942 అనే ఫోన్ నంబరుకు ఫోన్ చేసి చెప్పాలని, అందుకు ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశామని అన్నారు.