అర్హులైన మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం అందించే మహిళా సమృద్ధి యోజన పథకాన్ని త్వరలో అమలు చేస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా వెల్లడించారు. ఎన్నికల సమయంలో అర్హులైన మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఈ హామీని త్వరలో నెరవేరుస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.
ఎన్నికల మేనిఫెస్టో హామీలకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఢిల్లీలో పేద మహిళలకు ఆర్థిక సహాయం పథకాన్ని ఆమోదించినట్లు ఆమె తెలిపారు. ఈ పథకం అమలు పర్యవేక్షణకు తన నేతృత్వంలోనే ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కమిటీలో ఆశిష్ సూద్, పర్వేశ్ శర్మ, కపిల్ మిశ్రా వంటి సీనియర్ మంత్రులు ఉన్నట్లు చెప్పారు. ఈ పథకం కింద పేర్ల నమోదుకు ప్రత్యేకంగా వెబ్ పోర్టల్‌ను అందుబాటులోకి తెస్తామని ఆమె తెలిపారు.