మహిళా ఉద్యోగుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ ఉద్యోగులకు కాన్పుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రసూతి సెలవులు మంజూరు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గతంలో ఇద్దరు పిల్లల వరకు మాత్రమే ప్రసూతి సెలవులు ఇచ్చేవారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్కాపురంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేశారు. దేశంలో జనాభా సమతుల్యతను కాపాడాల్సిన అవసరం ఉందని, యువత దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని ఆయన అన్నారు. కుటుంబ నియంత్రణ పద్ధతులను విడనాడి ఎక్కువ మంది పిల్లలను కనాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
పాశ్చాత్య దేశాల్లో తక్కువ జననాల వల్ల వస్తున్న సమస్యలను గుర్తు చేస్తూ, పిల్లలను కనడం, వారిని పెంచడం ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోందని ఆయన అన్నారు. గతంలో ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు అనే నిబంధనను ప్రభుత్వం తొలగించింది. తాజాగా, మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవుల విషయంలో కూడా నిబంధనలను సడలించింది. ఈ నిర్ణయం ద్వారా, ప్రభుత్వ ఉద్యోగినులు ఎంత మంది పిల్లలను కన్నా వారికి జీతంతో కూడిన ప్రసూతి సెలవులు లభిస్తాయి.