లగచర్ల, హకీంపేటలో భూసేకరణపై రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. లగచర్ల, హకీంపేటలో భూసేకరణ చేయవద్దంటూ హైకోర్టు స్టే విధించింది. భూసేకరణను ఆపేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటు నిమిత్తం భూసేకరణ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటును స్థానిక రైతులు వ్యతిరేకించారు. భూసేకరణపై రైతుల అభిప్రాయం తీసుకునేందుకు కలెక్టర్ లగచర్లకు వెళ్లిన సమయంలో దాడి కూడా జరిగింది. కలెక్టర్ మీద దాడికి సంబంధించి అరెస్టులు కూడా జరిగాయి.
ఈ నేపథ్యంలో లగచర్లలో ఫార్మా కంపెనీలను ఏర్పాటు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లను విచారించిన న్యాయస్థానం స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.
హకీంపేట భూసేకరణ నోటిఫికేషన్‌ను శివకుమార్ అనే వ్యక్తి హైకోర్టులో సవాల్ చేశారు. భూసేకరణ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కోరారు. నోటిఫికేషన్‌ను రద్దు చేసేంత వరకు స్టే విధించాలని కోరారు. ప్రభుత్వం గత ఏడాది నవంబర్ 29న భూసేకరణపై నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇక్కడ ఇండస్ట్రియల్ పార్కు కోసం 351 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే, 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించడం లేదంటూ పిటిషనర్ కోర్టుకు తెలిపారు.