బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కవితకు ఇంకా దొరల అహంకారం తగ్గలేదని అన్నారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిందని… రాష్ట్ర ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారనే విషయం ఎన్నికల ఫలితాలతో రుజువయిందని చెప్పారు. తరచూ బీజేపీని, ఎన్నికల సంఘాన్ని విమర్శించే నాయకులకు ఈ ఎన్నికలు గుణపాఠమని అన్నారు. ఈవీఎంలపై విమర్శలు గుప్పించే నేతలు… ఇప్పుడు బ్యాలెట్ పేపర్లతో జరిగిన ఎన్నికల ఫలితాలకు ఏం సమాధానం చెబుతారని ఎద్దేవా చేశారు.
మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో తెలంగాణలో బీజేపీ శ్రేణులు జోష్ లో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. రాబోయే అన్ని ఎన్నికల్లో విజయం సాధించాలనే పట్టుదలతో శ్రేణులు ఉన్నాయి. ముఖ్యంగా త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని బీజేపీ నేతలు వ్యూహరచన చేస్తున్నారు.