రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ షాకిచ్చారు. ఆ దేశానికి అందిస్తున్న మిలటరీ సాయాన్ని నిలిపివేస్తూ ఆదేశాలు జారీచేశారు. అమెరికా శ్వేతసౌధంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీతో మాటల యుద్ధం తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
అధ్యక్షుడు (ట్రంప్) శాంతి విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారని, తమ భాగస్వాములందరూ ఆ లక్ష్యానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందని వైట్‌హౌస్ అధికారి ఒకరు తెలిపారు. తాము అందిస్తున్న సాయం సమస్య పరిష్కారానికి పనికొస్తుందా? లేదా? అన్నదానిపై సమీక్షిస్తామని, అందుకే సాయాన్ని నిలిపివేసినట్టు పేర్కొన్నారు.
శుక్రవారం వైట్‌హౌస్‌లో రష్యా-ఉక్రెయిన్ అధ్యక్షుల మధ్య జరిగిన సమావేశం వాడీవేడిగా సాగింది. రష్యాతో యుద్ధంలో సాయం చేస్తున్నా ఉక్రెయిన్ తమకు కృతజ్ఞతగా ఉండటం లేదని ట్రంప్ నిందించారు. ఉక్రెయిన్‌కు ఆయుధాలు తీసుకెళుతూ పోలండ్‌లోని ట్రాన్సిట్ ఏరియాలో ఉన్న నౌకలు, విమానాలను అక్కడే నిలిపివేయనున్నట్టు వైట్‌హౌస్ అధికారి తెలిపారు. కాగా, జెలెన్‌స్కీపై ట్రంప్ నిన్న కూడా విరుచుకుపడ్డారు. మరోవైపు, రష్యాతో యుద్ధం ముగింపు అంశం చాలా దూరంలో ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు తాజాగా వ్యాఖ్యానించడం గమనార్హం