పవిత్ర గంగానది నీరు స్నానానికి పనికి రాదని బీహార్ కాలుష్య నియంత్రణ మండలి (బీఎస్‌పీసీబీ) తేల్చింది. రాష్ట్రంలోని 34 ప్రాంతాల్లో రెండు వారాలపాటు నిర్వహించిన గంగానది నీటి నాణ్యత పరిశీలనలో ఈ విషయం వెల్లడైనట్టు అధికారులు తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీలో ఇటీవల ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే 2024-25 ఈ విషయాన్ని వెల్లడించింది.
గంగానది, దాని ఉప నదుల ఒడ్డున ఉండే పట్టణాల నుంచి మురుగునీరు, ఇళ్ల నుంచి వచ్చి కలిసే నీరు కారణంగా నదిలో పెద్ద మొత్తంలో బ్యాక్టీరియా చేరిందని సర్వే వివరించింది. అలాగే, గంగ, దాని ఉప నదుల్లో పీహెచ్, డిజాల్వ్‌డ్ ఆక్సిజన్, బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీవోడీ) వంటివి పరిమిత స్థాయిలోనే ఉన్నాయని తేల్చింది. ఈ నీరు జల జీవరాశులు, చేపల పెంపకానికి, వ్యవసాయానికి సరిపోతుందని పేర్కొంది. ఈ సందర్భంగా బీఎస్‌పీసీబీ చైర్మన్ శుక్లా మాట్లాడుతూ.. కేంద్ర కాలుష్య మండలి ప్రమాణాల కంటే గంగానదిలో చాలా చోట్ల ఫీకల్ కోలిఫాం పరిమితికి మించి ఉందని తెలిపారు. కాబట్టి ఈ నీరు స్నానానికి పనికి రాదన్నారు. నదిలో కలిసే మురుగు నీటిని శుద్ధి చేసేందుకు ప్రయత్నిస్తామని వివరించారు