2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. భారత్ అధిక ఆదాయ దేశంగా మారాలంటే 7.8 శాతం వృద్ధి రేటు సాధించాలని ప్రపంచ బ్యాంకు తాజాగా విడుదల చేసిన ‘ఇండియా కంట్రీ మెమోరాండం’ నివేదికలో పేర్కొంది.
భారత్ వృద్ధి రేటు 7.8 శాతం చేరుకోవాలంటే దేశీయ స్థూల జాతీయ ఆదాయం ప్రస్తుతం ఉన్న దాంతో పోలిస్తే సుమారు ఎనిమిది రెట్లు పెరగాలని తెలిపింది. ఆర్థిక రంగంతో పాటు భూ, కార్మిక రంగంలో సంస్కరణలు అవసరమని అభిప్రాయపడింది. ఇందుకోసం ప్రస్తుత కార్యక్రమాలు కొనసాగించడంతో పాటు నూతన సంస్కరణలను విస్తరించాలని పేర్కొంది. భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే సగటు వృద్ధి రేటు 7.8 శాతంగా ఉండాలని పేర్కొంది. వేగవంతమైన సంస్కరణల ద్వారానే ఇది సాధ్యమవుతుందని తెలిపింది.
2000-2024 మధ్య కాలంలో భారత్ వృద్ధి రేటు సగటున 6.3 శాతంగా ఉందని వెల్లడించింది. గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా మారడానికి ఇటీవలి కాలంలో భారత్ అనేక నిర్మాణాత్మక సంస్కరణలను చేపట్టిందని తెలిపింది. వీటిలో భాగంగానే మౌలిక సదుపాయాల కల్పన, మానవ మూలధనాన్ని మెరుగుపరచడం, స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించడం వంటి సంస్కరణలు చేపట్టిందని వెల్లడించింది.