ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యమిచ్చిన పాకిస్థాన్ లీగ్ దశలోనే టోర్నీ నుండి నిష్క్రమించింది. కివీస్‌తో 60 పరుగుల తేడాతో, భారత్‌తో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ రోజు బంగ్లాదేశ్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా నిష్క్రమించింది. 1996 ప్రపంచ కప్ తర్వాత ఐసీసీ ఈవెంట్‌కు పాకిస్థాన్ ఆతిథ్యమివ్వడం ఇదే తొలిసారి.
సుమారు మూడు దశాబ్దాల తర్వాత ఆతిథ్యమిచ్చిన ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో మ్యాచ్‌లేవీ గెలవకుండా అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకుంది. గత 23 ఏళ్లలో ఐసీసీ టోర్నమెంటుకు ఆతిథ్యమిస్తూ ఒక్క మ్యాచ్‌లోనూ విజయం సాధించని జట్టు పాకిస్థాన్ కావడం గమనార్హం.
ఐసీసీ నాకౌట్ ఈవెంట్‌గా మొదలైన ఈ ట్రోఫీ తొలి టోర్నీ 1998లో బంగ్లాదేశ్‌లో ప్రారంభమైనప్పటికీ, వివిధ కారణాలతో ఆ దేశం పాల్గొనలేదు. 2000లో ఆతిథ్యమిచ్చిన కెన్యా ప్రీ-క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయింది. 2002లో ఛాంపియన్స్ ట్రోఫీగా రూపాంతరం చెందింది. 2002లో భారత్, శ్రీలంక సంయుక్త విజేతగా నిలువగా, 2004లో ఆతిథ్యమిచ్చిన ఇంగ్లాండ్ రన్నరప్‌గా నిలిచింది. 2006లో ఆతిథ్యమిచ్చిన భారత్, 2009లో ఆతిథ్యమిచ్చిన దక్షిణాఫ్రికా తమ గ్రూపుల్లో మ్యాచ్‌లను నెగ్గాయి. కానీ పాకిస్థాన్ ఈసారి ఒక్క మ్యాచ్ కూడా నెగ్గలేదు.