శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల్లోని నీటిని ఉభయ తెలుగు రాష్ట్రాలు సమర్థవంతంగా వినియోగించుకోవాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశంలో నిర్ణయించారు. త్రాగునీటి అవసరాలకు మొదటి ప్రాధాన్యతనిస్తూ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పంటల సాగును దృష్టిలో ఉంచుకుని నీటిని వినియోగించుకోవాలని చైర్మన్ అతుల్ జైన్ నేతృత్వంలోని బోర్డు నిర్ణయించింది. ఈ బోర్డు సమావేశం హైదరాబాద్లోని జలసౌధలో జరిగింది.
తెలంగాణ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ అనిల్ కుమార్, ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, ఈఎన్సీ వెంకటేశ్వరరావు, ఇతర ఇంజినీర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల్లో నీటి వినియోగంపై ఈ సమావేశంలో చర్చించారు.
మే నెలాఖరు వరకు తెలంగాణ రాష్ట్రానికి 63 టీఎంసీల నీరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, 55 టీఎంసీల నీరు అవసరమని ఆయా రాష్ట్రాలు కోరాయి. ప్రస్తుతం రెండు జలాశయాల్లో వినియోగ మట్టానికి ఎగువన 60 టీఎంసీలకు పైగా నీరు అందుబాటులో ఉంది. అందుబాటులో ఉన్న నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని బోర్డు సూచించింది. ప్రతి పదిహేను రోజులకు ఒకసారి పరిస్థితిని సమీక్షించుకుంటూ ముందుకు సాగాలని తెలిపింది.