వరంగల్ బ్యూరో, ఫిబ్రవరి 26 (ప్రజాజ్యోతి):
హనుమకొండ జిల్లా వేలేరు లోని ఓ పోలింగ్ కేంద్రంలో నలుగురే ఓటర్లు ఉన్నారు. కాగా ఎన్నికల నిర్వహణకు ఐదుగురు సిబ్బందిని కేటాయించవలసి వచ్చింది. వరంగల్ – ఖమ్మం – నల్గోండ టీచర్స్ ఎమ్మెల్సీ పరిధిలో ని 269 పోలింగ్ స్టేషన్ లో నలుగురు టీచర్లు మాత్రమే ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఈ మేరకు పోలింగ్ సిబ్బంది మెటీరియల్ తో పోలింగ్ స్టేషన్ కు చేరుకున్నారు. ఈ సందర్బంగా పోలింగ్ మెటీరియల్ డిస్పాచ్ కౌంటర్లను పరిశీలించి కలెక్టర్ ప్రావిణ్య మాట్లాడుతూ.. రూట్ ఆఫీసర్లు, జోనల్ ఆఫీసర్లు ,పిఓ లు, ఏపీవోలు, మైక్రో అబ్జర్వర్స్ ఎన్నికలను సక్రమంగా ఎలాంటి పొరపాట్లు లేకుండా సజావుగా నిర్వహించాలని తెలిపారు. పోలింగ్ అనంతరం పోలింగ్ బాక్స్ లను జాగ్రత్తగా సీల్ చేయాలని సూచించారు. హనుమకొండ జిల్లా టీచర్స్ నియోజకవర్గంలో 5215 ఓటర్లు ఉన్నారు. మెదక్-నిజామాబాద్- ఆదిలాబాద్- కరీంనగర్ టీచర్స్ నియోజకవర్గంలో జిల్లాకు సంబంధించి166 మంది ఓటర్లు ఉన్నారు. మెదక్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గంలో 4585 మంది ఓటర్లు ఉన్నారు. జిల్లాలో మొత్తం 24 పోలింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు.