పెళ్లి చేసుకుని లక్షణంగా కాపురం చేసుకుంటే ఉద్యోగం ఉంటుంది.. లేదంటే ఉద్యోగంపై ఆశలు వదులుకోండి’ అంటూ చైనాలోని ఓ కంపెనీ తమ ఉద్యోగులకు హుకుం జారీ చేసింది. చైనాలోని టాప్-50 కంపెనీల్లో ఒకటైన షన్‌టైన్ కెమికల్ గ్రూప్‌లో 1200 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో అవివాహితులు, విడాకులు తీసుకున్న వారికి కంపెనీ తాజాగా నోటీసులు ఇచ్చింది. పెళ్లి చేసుకుంటేనే ఉద్యోగం ఉంటుందని, లేదంటే ఉద్యోగం పోతుందని హెచ్చరించింది. తమ సంస్థలో వివాహితుల సంఖ్యను పెంచే ఉద్దేశంతోనే సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ తన కథనంలో పేర్కొంది.
28 నుంచి 58 ఏళ్ల మధ్య వయసుండి ఒంటరిగా ఉంటున్న ఉద్యోగులందరూ సెప్టెంబర్‌లోగా వివాహం చేసుకోవాలని, లేదంటే వేరే ఉద్యోగం చూసుకోవాలని హెచ్చరించింది. సెప్టెంబర్ వరకు కూడా వివాహం చేసుకోకుంటే ఉద్వాసన తప్పదని తేల్చి చెప్పింది.
షన్‌టైన్ కంపెనీ ఆదేశాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కంపెనీ తన పని తాను చూసుకోకుండా ఉద్యోగుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబాటు తగదని హితవు పలుకుతున్నారు. పెళ్లి చేసుకోవాలని ఉద్యోగులను ఆదేశించడం వారి స్వాతంత్ర్యాన్ని హరించడమే కాకుండా, రాజ్యాంగ విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతుండటంతో కంపెనీ తన ఆదేశాలను వెనక్కి తీసుకున్నట్టు తెలిసింది.