ఈ నెల 27న ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నందున ప్రైవేటు, ప్రభుత్వ విద్యా సంస్థలకు సెలవు ఇవ్వాలని తెలంగాణ బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. 27న గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి విలువైన ఓటు హక్కును వినియోగించుకునేందుకు పట్టభద్రులందరికీ అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేసిందని ఆయన తెలిపారు.
అయితే చాలా కళాశాలలు, పాఠశాలల్లో ఓటు హక్కు కలిగిన సిబ్బందికి కొన్ని గంటలు మాత్రమే అనుమతి ఇస్తామని చెబుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయన అన్నారు. ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు ఓటు హక్కు కలిగిన సిబ్బందికి రోజంతా సెలవును యాజమాన్యాలు ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ఏడాదిలో అందించే సెలవులకు, వీటికి సంబంధం లేకుండానే అదనంగా పోలింగ్ రోజు సెలవు దినంగా అవకాశం ఇవ్వాలని బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు.