కొందరు నేతలు చేసిన వ్యాఖ్యలకు బాధపడాల్సిన పని లేదని, అన్ని కులాలతో రెడ్డి సామాజిక వర్గం సఖ్యతతో ఉంటుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్ ‘రెడ్డి’ సామాజిక వర్గంపై విమర్శలు చేశారనే ప్రచారం నేపథ్యంలో జగ్గారెడ్డి స్పందించారు.
ఈరోజు గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, ఎవరో చేసిన వ్యాఖ్యలకు బాధపడవద్దని రెడ్డి సామాజిక వర్గానికి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకత భావంతో ఉండవద్దని ఆయన అన్నారు. ఎవరో ఏదో అన్నారని తొందరపడవద్దని, రెడ్డి సామాజిక వర్గం నేతలు ఓపిక వహించాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుందని తెలిపారు.
అంతకుముందు, అంజన్ కుమార్ యాదవ్ కూడా రెడ్డి సామాజిక వర్గంపై తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు వక్రీకరించారని ఆరోపించారు. తనకు రెడ్డి సామాజిక వర్గంలో చాలామంది స్నేహితులు ఉన్నారని, వారి పట్ల తనకు ఎలాంటి వ్యతిరేకత లేదని తెలిపారు.