శ్రీకాకుళం-విజయనగరం-విశాఖ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పాకాలపాటి రఘువర్మకు మద్దతు ఇస్తున్నట్టు జనసేన పార్టీ హైకమాండ్ నేడు ప్రకటించింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. తూర్పు గోదావరి-పశ్చిమ గోదావరి… ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం కోసం ఏ విధంగా జనసేన అండగా నిలుస్తుందో… ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఒకే మాట మీద నిలవాలని పవన్ పార్టీ శ్రేణులకు సూచించారు.
ఇవాళ జనసేన రాజకీయ వ్యవహారాల చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ నేడు ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన జనసేన ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రదర్శించిన స్ఫూర్తినే ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కనబర్చాలని నాదెండ్ల పిలుపునిచ్చారు.
ఏపీలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలకు ఇటీవలే నోటిఫికేషన్ విడుదల చేశారు. ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుండగా, మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు