అతి తక్కువ ధరలో ‘ఐఫోన్ 16ఈ’ని విడుదల చేసిన యాపిల్.. ధర.. ఫీచర్ల వివరాలు ఇవిగో

V. Sai Krishna Reddy
2 Min Read

యాపిల్ తన తాజా ఐఫోన్ మోడల్ ‘ఐఫోన్ 16ఈ’ని భారత మార్కెట్లకు పరిచయం చేసింది. అయితే, ఈ ఫోన్‌ను లాంచ్ చేస్తూనే ఇప్పటి వరకు ప్రచారం కల్పించిన ‘ఐఫోన్ ఎస్ఈ 4’ని అధికారిక స్టోర్ నుంచి తొలగించింది. ‘ఐఫోన్ ఎస్ఈ 4’ను విడుదల చేస్తున్నట్టు ప్రచారం జరిగినప్పటికీ, హఠాత్తుగా దానిని ఆపేసి, ‘ఐఫోన్ 16’ సిరీస్‌ను విస్తరిస్తూ ‘16ఈ‘ని విడుదల చేసింది. బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్‌లో భాగంగా దీనిని లాంచ్ చేసినట్టు యాపిల్ పేర్కొంది.

ఐఫోన్ 16ఈ: భారత్‌లో ధర, ప్రీ ఆర్డర్ వివరాలు

ఐఫోన్ 16ఈ 128 జీబీ వేరియంట్ ప్రారంభ ధర అమెరికాలో 599 డాలర్లు. భారత కరెన్సీలో చెప్పాలంటే దాదాపు రూ. 49,500. ఇండియాలో మాత్రం దీని ధర రూ. 59,900. ఐఫోన్ 16 సిరీస్ ప్రారంభ ధర ఇండియాలో రూ. 79,900 కాగా, ‘16ఈ’ని బడ్జెట్ ఫ్రెండ్లీగా తీసుకొచ్చింది. దీంతో ఈ రెండు ఫోన్ల మధ్య ధర విషయంలో రూ. 20 వేల తేడా ఉంది. ఈ నెల 21 నుంచి ప్రీ ఆర్డర్లు మొదలవుతాయి. 28 నుంచి డెలివరీ ప్రారంభమవుతుంది. ‘ఐఫోన్ 16ఈ’ 256 స్టోరేజీ మోడల్ ధర రూ. 69,900 కాగా, 512 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ. 89,900.

ఐఫోన్ 16ఈ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు

ఐఫోన్ 16ఈ ఫోన్‌లో నాచ్‌తో కూడిన 6.1 అంగుళాల ఓలెడ్ డిస్‌ప్లే అమర్చారు. ఫేషియల్ రికగ్నిషన్ కోసం ఫేస్ ఐడీ సిస్టం ఏర్పాటు చేశారు. 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తోంది. కెమెరా, డునాట్ డిస్టర్బ్ మోడ్ క్విక్ యాక్సెస్ కోసం యాక్షన్ బటన్ ఇచ్చారు. అదనంగా యూఎస్‌బీ-సి పోర్టు ఏర్పాటు చేశారు. అలాగే, ఇందులో ఏ18 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. ఏ13 బయోనిక్ చిప్‌తో పోలిస్తే, ఇది 80 శాతం వేగంగా పనిచేస్తుంది.

ఇక, కెమెరా విషయానికి వస్తే.. అత్యధిక రిజల్యూషన్స్‌తో ఫొటోలు తీసుకునేందుకు 48 ఎంపీ ఫ్యూజన్ రియర్ కెమెరాను అమర్చారు. అలాగే, 2ఎక్స్ టెలిఫొటో జూమ్ ఆప్షన్ కూడా ఉంది. ఇది డిఫాల్ట్‌గా 24 ఎంపీ ఫొటోలను తీస్తుంది. అయితే, అత్యధిక రిజల్యూషన్‌తో ఫొటోలు తీయాలనుకున్నప్పుడు 48 ఎంపీ మోడ్‌ను సెట్‌ చేసుకోవచ్చు. ముందువైపు 12 ఎంపీ ట్రూ డెప్త్ కెమెరాను, సమర్థవంతమైన బ్యాటరీని అమర్చారు. ఈ బ్యాటరీ 26 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుంది. వైర్‌లెస్ చార్జింగ్, శాటిలైట్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి. శాటిలైట్ కమ్యూనికేషన్ ఫీచర్‌తో కవరేజ్ అంతగా లేని ప్రాంతాల నుంచి కూడా నిరంతరాయంగా టచ్‌లో ఉండే అవకాశం లభిస్తుంది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *