కాలేజీకి డుమ్మాకొట్టి నలుగురు బాలికలు షాపింగ్ మాల్ కు వెళ్లారు. విషయం తెలిసి ఇంట్లో తల్లిదండ్రులు, కాలేజీలో లెక్చరర్లు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన బాలికలు గురువారం తెల్లవారుజామున ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం ముస్తాబాదలో ఈ ఘటన కలకలం సృష్టించింది. తమ పిల్లలు కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.
వారి నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు ఆగమేఘాలమీద స్పందించారు. బాలికలు నలుగురూ హైదరాబాద్ వెళుతున్నట్లు గుర్తించి పిడుగురాళ్ల పోలీసులను అప్రమత్తం చేశారు. పిడుగురాళ్ల పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టి బాలికలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బాలికలకు కౌన్సెలింగ్ చేసి వారి తల్లిదండ్రులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.