అధికారమే పరమావధిగా పనిచేసే ఆలోచన తమకు లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో కేసీఆర్ ఆధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ, బీఆర్ఎస్ రజతోత్సవం ప్రజా ఉత్సవంగా నిర్వహించాలని తమ పార్టీ నిర్ణయించిందని వెల్లడించారు.
ప్రజా ఉద్యమాలు, విప్లవ పోరాటాలకు పురిటిగడ్డ మన తెలంగాణ అని ఆయన అన్నారు. తెలంగాణ పోరాటంలో ప్రాణత్యాగాల గురించి పార్టీ సమావేశంలో గుర్తు చేసుకున్నట్లు చెప్పారు. రానున్న కాలంలో పార్టీ కార్యక్రమాలపై కేసీఆర్ దిశా నిర్దేశం చేశారని ఆయన తెలిపారు.
తెలంగాణ అస్తిత్వం, ప్రజల ప్రయోజనాలే తమ పార్టీకి ముఖ్యమని కేటీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవాలు ఏడాది పాటు నిర్వహించాలని నేటి సమావేశంలో నిర్ణయించామని అన్నారు. ఉత్సవాల నిర్వహణకు సీనియర్ నేతల ఆధ్వర్యంలో త్వరలో కమిటీలను ఏర్పాటు చేయబోతున్నామని ఆయన తెలిపారు