గుండెపోటుకు నెల రోజుల ముందే… కళ్లలో కనిపించే లక్షణాలివే

V. Sai Krishna Reddy
2 Min Read

మారిన జీవన శైలి, ఊబకాయం, షుగర్, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ వంటివి గుండెపోటుకు దారితీస్తూ ఉంటాయి. దీనికి సంబంధించి మన శరీరంలో కొన్ని రోజుల ముందే… ఆ సమస్యలు మొదలవుతాయి. వాటికి సంబంధించి కొన్ని రకాల లక్షణాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. కొన్ని సార్లు రోజులే కాదు నెలల ముందు నుంచే గుండెపోటుకు సంబంధించి లక్షణాలు కనిపించడం మొదలవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందులో భాగంగా కళ్లలో కనిపించే మార్పులపై పలు సూచనలు చేస్తున్నారు. వీటిని గుర్తించి జాగ్రత్తపడటం ద్వారా గుండెపోటు ముప్పును తప్పించుకోవచ్చని సూచిస్తున్నారు.

గుండె పోటుకు సంబంధించి కళ్లలో ముందుగానే కనిపించే లక్షణాలివే…

కళ్ల రంగులో మార్పులు..

కనుగుడ్లు పసుపు లేదా లేత నారింజ రంగులోకి మారి కనిపిస్తుంటే… శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (ఎల్ డీఎల్) స్థాయి బాగా పెరిగిపోయిందని అర్థమని నిపుణులు చెబుతున్నారు. రక్త నాళాల్లో చెడు కొలెస్ట్రాల్ అడ్డుపడుతుండటం కూడా దీనికి కారణమని వివరిస్తున్నారు. ఇది త్వరలోనే గుండెపోటుకు దారి తీసే అవకాశం ఎక్కువని స్పష్టం చేస్తున్నారు.

రక్త నాళాలు ఉబ్బి కనిపించడం

కళ్లలో రక్త నాళాలు ఎరుపెక్కి కనిపించడం శరీరంలో రక్తపోటు తీవ్ర స్థాయికి చేరిందనే దానికి సూచిక అని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో తీవ్ర అలసట, నీరసం వంటివి కూడా ఉంటాయని వివరిస్తున్నారు. ఇవి గుండెపోటుకు ముందస్తు లక్షణాలు అని పేర్కొంటున్నారు.

కళ్ల చుట్టూ వాపు…

తరచూ కళ్ల చుట్టూ వాపు రావడం, కళ్లు ఉబ్బిపోయి ఉండటం వంటివి శరీరంలో ద్రవాల సమతుల్యత దెబ్బతిన్నదనే దానికి గుర్తు అని నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా గుండెపోటుకు దారితీసే అవకాశాలు ఎక్కువని వివరిస్తున్నారు.

కళ్ల లోపలి భాగంలో నొప్పి…

కారణమేదీ లేకుండా… కళ్ల లోపలి భాగంలో తరచూ నొప్పి వస్తుండటం కూడా గుండెపోటుకు ముందస్తు సూచిక అని వైద్య నిపుణులు చెబుతున్నారు. రక్త నాళాల్లో రక్తం సరఫరా తగిన స్థాయిలో జరగకపోవడమే దీనికి కారణమని పేర్కొంటున్నారు.

తరచూ తీవ్ర తలనొప్పి…

పెద్దగా కారణమేదీ లేకుండానే… తరచూ తీవ్రమైన తలనొప్పి రావడం గుండె, రక్త సరఫరా వ్యవస్థలకు సంబంధించిన సమస్య అయి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అదే సమయంలో కంటి చూపు కూడా దెబ్బతింటూ ఉంటుందని వివరిస్తున్నారు.

ఈ అంశాలు గుర్తుంచుకోండి

గుండె పోటు అనేది అత్యంత తీవ్రమైన, ప్రాణాంతకమైన సమస్య. పైన చెప్పిన లక్షణాలేవీ కూడా కనిపించకుండా కూడా గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేగాకుండా పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తుంటే కచ్చితంగా గుండెపోటు వస్తుందని చెప్పలేమని… ఇతర అనారోగ్య సమస్యలు కూడా అయి ఉండవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అయితే ఈ లక్షణాలను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయవద్దని, వీలైనంత త్వరగా వైద్యులను సంప్రదించి తగిన చికిత్స చేయించుకోవాలని సూచిస్తున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *