గతంలో ఎన్నడూ లేనంతగా హోరాహోరీగా సాగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ మళ్లీ పాగా వేసింది. ఈ నేపథ్యంలో, ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో విజయోత్సవ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఢిల్లీ ప్రజలు ఇకపై ఆధునిక నగరాన్ని చూడబోతున్నారని అన్నారు. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో నిజమైన అభివృద్ధి చూడొచ్చని పేర్కొన్నారు. పనితీరు ఆధారంగానే అనేక రాష్ట్రాల్లో మళ్లీ బీజేపీకే అధికారం ఇస్తున్నారని తెలిపారు. హర్యానాలో సుపరిపాలనకు నాంది పలికామని, మహారాష్ట్ర రైతులకు అన్ని విధాలుగా అండగా ఉన్నామని మోదీ చెప్పారు. బీహార్ లో నితీశ్ కుమార్ కూడా ఎన్డీయేపై విశ్వాసం ఉంచారని, ఏపీలో చంద్రబాబు తన ట్రాక్ రికార్డు నిరూపించుకున్నారని వివరించారు.
బీజేపీ పథకాలు పేదలు, మధ్య తరగతి ప్రజలకు మేలు చేసేలా ఉంటాయని స్పష్టం చేశారు. మోదీ గ్యారెంటీ అంటే తప్పకుండా పూర్తయ్యే గ్యారెంటీ అని ఉద్ఘాటించారు.
ఢిల్లీని వాతావరణ కాలుష్యం, పారిశుద్ధ్య సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఎన్డీయే కూటమే అధికారంలో ఉంది. ఎన్డీయే పాలిత రాష్ట్రాలతో పోల్చితే ఢిల్లీలో పాలన ఎంత అధ్వానంగా ఉందో అందరూ చూశారు. అవినీతిపై పోరాడతామన్న వారే అవినీతిలో కూరుకుపోయారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అవినీతి కేసులో జైలుకు వెళ్లారు. అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే ఎన్నో సంవత్సరాల పాటు పోరాడారు. ఇవాళ ఆ అవినీతి పార్టీ ఓటమిపై అన్నా హజారే కూడా సంతోషిస్తున్నారు.