మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించిన ప్రభుత్వం
దరఖాస్తులను స్వీకరించాలని మీసేవ కమిషనర్‌ను కోరిన పౌరసరఫరాల శాఖ
మార్పులు అవసరమైన వారికీ అప్‌డేట్ చేసుకునే వెసులుబాటు
రేషన్ కార్డులు లేని నిరుపేదలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్తను అందించింది. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ ప్రభుత్వం ప్రజలకు ఊరటనిచ్చింది. లబ్ధిదారుల నుంచి రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించాలని మీసేవ కమిషనర్‌ను పౌరసరఫరాల శాఖ కోరింది.
రేషన్ కార్డుల మంజూరుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం ఇదివరకే విడుదల చేసింది. ఇదిలా ఉండగా, కొత్త రేషన్ కార్డులతో పాటు రేషన్ కార్డుల్లో మార్పులు, చిరునామా మార్పులు, ఇతర వివరాల నవీకరణలను కూడా ఆన్‌లైన్ ద్వారా సులభంగా చేసుకునే వెసులుబాటును కల్పించింది.
కొత్త రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని, దీనికి నిర్దిష్టమైన గడువు అంటూ ఏమీ లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డును అందిస్తామని తెలిపింది.