బహుశా ఉమ్మడి ఏపీలోకానీ, తెలంగాణలో కానీ.. ఆ సామాజిక వర్గం లేని క్యాబినెట్ ప్రస్తుత తెలంగాణ మంత్రివర్గమే అనడంలో సందేహం లేదు.
తెలంగాణలోని ప్రధాన సామాజిక వర్గాల్లో ఒకదానికి రాష్ట్ర విభజన తర్వాత పెద్దగా ప్రాధాన్యం దక్కకుండా పోతోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా ఈ సామాజిక వర్గానికి చెందిన నాయకులు మంత్రి పదవుల్లో, పార్టీ పదవుల్లో కీలకంగా ఉండేవారు. విభజన తర్వాత మారిన పరిస్థితుల్లో అవకాశాలు పెద్దగా దక్కలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో మాత్రం మంత్రి పదవుల్లో ప్రాధాన్యం లభించింది. కాంగ్రెస్ సర్కారు వచ్చాక ఆ కులం నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో సీనియర్లు లేకపోవడంతో అమాత్య యోగం దక్కలేదు. బహుశా ఉమ్మడి ఏపీలోకానీ, తెలంగాణలో కానీ.. ఆ సామాజిక వర్గం లేని క్యాబినెట్ ప్రస్తుత తెలంగాణ మంత్రి వర్గమే అనడంలో సందేహం లేదు.
మూడు పార్టీల్లోనూ కీలకంగా.. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్.. తెలంగాణలో మూడు ప్రధాన పార్టీలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ మూడూ మున్నూరు కాపులకు ప్రాధాన్యం ఇచ్చినవే. ఇస్తున్నవే. బీఆర్ఎస్ పాలనలో పలువురు మున్నూరు కాపు నేతలకు మంత్రి పదవులు దక్కాయి. కే.కేశవరావు వంటివారికి పార్టీలో, ప్రభుత్వంలో పెద్ద పీట వేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన వద్దిరాజు రవిచంద్రకు రెండుసార్ల రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు. రెండోసారి కేసీఆర్ కుటుంబ సభ్యుడు సంతోష్ కుమార్ ఖాళీ చేసిన స్థానాన్ని ఇవ్వడం గమనార్హం.