కరీంనగర్ కలెక్టరేట్(Karimnagar Collectorate)లో గందరగోళం చోటుచేసుకుంది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్(Sanjay Kumar) మాట్లాడుతుండగా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి(Kaushik Reddy) మధ్యలో కలుగజేసుకొని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. అనంతరం కలెక్టరేట్ ఎదుట కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ హాట్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యే సంజయ్ అమ్ముడుపోయారని ఆరోపించారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. కాంగ్రెస్ నుంచి గెలవాలని సవాల్ చేశారు. సంజయ్‌కి ఎమ్మెల్యే పదవి కేసీఆర్(KCR) పెట్టి భిక్ష అని అన్నారు.
మూడేళ్ల తర్వాత మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారని.. తామేంటో అప్పుడు చూపిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారులతో పాటు ఎవరినీ వదలబోము అని వార్నింగ్ ఇచ్చారు. పోలీసులకు కేసీఆర్ ఏం తక్కువ చేశారని అన్నారు. కాగా, కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) అధ్యక్షతన ఆదివారం జిల్లా సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతుండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అడ్డుకున్నాడు. ‘‘నువ్వు ఏ పార్టీలో గెలిచి, ఏ పార్టీలోకి వెళ్లావు. అసలు నీది ఏ పార్టీ’’ అంటూ కౌశిక్ రెడ్డి నిలదీశాడు. దీంతో గొడవ మొదలై పరిస్థితి చేదాటిపోయింది.