బస్టాండ్‌ ఊరికి దూరమైతే.. ప్రజలకు ఇబ్బందులే! ప్రస్తుత బస్టాండ్‌ స్థలంలోనే కాంప్లెక్స్‌.. కొత్త బస్టాండ్‌ ఊరి చివరన వద్దు

2 Min Read

బస్టాండ్‌ ఊరికి దూరమైతే.. ప్రజలకు ఇబ్బందులే!

ప్రస్తుత బస్టాండ్‌ స్థలంలోనే కాంప్లెక్స్‌.. కొత్త బస్టాండ్‌ ఊరి చివరన వద్దు

ప్రభుత్వం నిర్ణయాన్ని మరోసారి పరిశీలించాలి

సీపీఐ నియోజకవర్గ ఇన్‌చార్జి గంటి సురేష్‌కుమార్‌

కొడంగల్‌ సెప్టెంబర్ 24 ప్రజా జ్యోతి

కొడంగల్‌ పట్టణంలో నూతన బస్టాండ్‌ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ప్రతిపాదిత స్థలంపై మరోసారి ఆలోచించాలని సీపీఐ నియోజకవర్గ ఇన్‌చార్జి గంటి సురేష్‌కుమార్‌ కోరారు. ప్రస్తుతం ఉన్న బస్టాండ్‌ ప్రాంతంలోనే అవసరమైన కాంప్లెక్స్‌ నిర్మించి, బస్టాండ్‌ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని ఆయన సూచించారు. గురువారం కొడంగల్ పట్టణ కేంద్రం లో విలేకరులతో మాట్లాడుతూ
హైదరాబాద్‌ రూట్‌లో పట్టణానికి చివరన నూతన బస్టాండ్‌ నిర్మించాలనే ప్రతిపాదన వల్ల ప్రయాణికులతో పాటు స్థానిక ప్రజలకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందన్నారు. బస్టాండ్‌ చుట్టూ ఏర్పడే రాకపోకలే పట్టణంలోని చిన్న వ్యాపారాలు, చిరు వ్యాపారులకు ప్రధాన ఆధారమని తెలిపారు.
ప్రస్తుత అంబేద్కర్‌ చౌరస్తా ప్రాంతంలో ప్రయాణికుల రాకపోకలతో అనేక చిన్న దుకాణాలు, చిరు వ్యాపారాలు కొనసాగుతున్నాయని సురేష్‌కుమార్‌ అన్నారు. ప్రయాణికులు కొనుగోలు చేయడం ద్వారా కొన్ని కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని పేర్కొన్నారు. బస్టాండ్‌ను పట్టణానికి దూరంగా తరలిస్తే ఆయా వ్యాపారాలకు గిరాకీ తగ్గి ఉపాధి అవకాశాలు దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు.
బస్టాండ్‌ ఒకచోట, పట్టణంలోని ప్రధాన వ్యాపార ప్రాంతాలు మరోచోట ఉంటే ప్రజలు రాకపోకలకు అదనపు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, విద్యార్థులు, రోజువారీ ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు.
స్థలం సరిపోవడం లేదనే కారణంతో బస్టాండ్‌ను పట్టణానికి దూరంగా తరలించడం సరైన నిర్ణయం కాదని ఆయన అన్నారు. ప్రస్తుత బస్టాండ్‌కు సమీపంలోనే అందుబాటులో ఉన్న స్థలాన్ని పరిశీలించి నూతన బస్టాండ్‌ నిర్మించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే ముందు ప్రజల అవసరాలు, స్థానిక వ్యాపారుల ఉపాధి, పట్టణ భవిష్యత్‌ రాకపోకలను దృష్టిలో పెట్టుకుని ప్రతిపాదిత స్థలాన్ని మరోసారి పరిశీలించాలని గంటి సురేష్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *