సిద్ధిపేట ప్రతినిధి, ఏప్రిల్ 01 , (ప్రజాజ్యోతి) :సిద్దిపేట భూమి మరోసారి ఆధ్యాత్మిక చైతన్యంతో నిండిపోయింది. హనుమాన్ దీక్షా మహిమను గ్రామాల వారీగా విస్తరించేందుకు పీఠాధిపతులు శ్రీ శ్రీ దుర్గాప్రసాద్ స్వామీజీ చేపట్టిన 108 గ్రామాల రథయాత్ర బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ రథయాత్రను సిద్దిపేట పంచముఖ హనుమాన్ దేవాలయం వద్ద మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సిద్దిపేట నుంచి ప్రారంభమైన ప్రతి ఆధ్యాత్మిక సంకల్పం సఫలమవుతుందనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉందన్నారు. హనుమాన్ దీక్ష, బిక్షా కార్యక్రమాలు, కోటి హనుమాన్ చాలీసా పారాయణం వంటి మహత్తర కార్యక్రమాలు ఈ నేల నుంచే ప్రారంభమై విశేష స్పందన పొందాయని గుర్తుచేశారు. విజయవాడ తర్వాత హనుమాన్ తెప్పోత్సవం సిద్దిపేటలోనే నిర్వహించడం ఈ ప్రాంత ఆధ్యాత్మిక వైభవానికి నిదర్శనమన్నారు.ప్రతి సంవత్సరం స్వామీజీ కొత్త సంకల్పాలతో ముందుకు వస్తూ, వాటిని విజయవంతం చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తారని అన్నారు. ముఖ్యంగా గిరిజన తండాలు వంటి వెనుకబడిన ప్రాంతాల్లో హనుమాన్ మాల, దీక్ష గొప్పతనాన్ని పరిచయం చేయడం సమాజానికి ఎంతో ఉపయోగకరమని తెలిపారు.ఈ రథయాత్ర ద్వారా రాష్ట్రవ్యాప్తంగా భక్తి భావాన్ని పెంపొందించడమే లక్ష్యమని, ప్రజల్లో ఆంజనేయ స్వామిపై విశ్వాసం మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. స్వామీజీ ఆశీస్సులతో ఈ యాత్ర విజయవంతంగా కొనసాగాలని కోరుకున్నారు.ఈ సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రథయాత్రకు శ్రీకారం చుట్టారు. సిద్దిపేట నుంచి ప్రారంభమైన ఈ యాత్ర 108 గ్రామాల్లో భక్తి సందేశాన్ని విస్తరించనుంది.ఈ కార్యక్రమములో కౌన్సిలర్ లు కొండం సంపత్ రెడ్డి, అరవింద్ రెడ్డి, లక్ష్మణ్, పట్టణ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు నేతి కైలాసము , మురం శెట్టి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
