బాల్క సుమన్‌కు దక్కని ఊరట: బెయిల్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా

V. Sai Krishna Reddy
1 Min Read

చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌కు న్యాయస్థానంలో ఈరోజు కాస్త నిరాశ ఎదురయింది. క్యాతనపల్లి ఘటనలో అరెస్టై జైలులో ఉన్న ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై మంచిర్యాల జిల్లా కోర్టులో ఈరోజు కూడా వాదనలు జరిగాయి. అయితే, పోలీసుల తరపున దాఖలైన కస్టడీ పిటిషన్ ఇంకా పెండింగ్‌లో ఉండటంతో, బెయిల్ వ్యవహారంపై తదుపరి విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. లంచ్ మోషన్ అనంతరం కస్టడీ పిటిషన్‌పై కోర్టు నిర్ణయం తీసుకోనుంది.

బాల్క సుమన్ తరపున న్యాయవాది లలిత కోర్టులో గట్టి వాదనలు వినిపించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే పోలీసులు అక్రమ కేసులు బనాయించారని ఆమె ఆరోపించారు. సుమన్ అరెస్టు ప్రక్రియలో సుప్రీంకోర్టు నిర్దేశించిన మార్గదర్శకాలను పోలీసులు పూర్తిగా గాలికి వదిలేశారని అన్నారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ ఎన్నికల సమయంలో ప్రభుత్వం అధికార బలంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని, కావాలనే బీఆర్ఎస్ నేతలను జైలు పాలు చేసిందని ఆమె వివరించారు.

మరోవైపు, కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడిని విచారించాల్సిన అవసరం ఉందని, అందుకే కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. క్యాతనపల్లి ఉదంతంలో బాల్క సుమన్ పాత్రపై మరింత లోతైన విచారణ జరపాల్సి ఉందని వారు వాదించారు. ఈ క్రమంలో బెయిల్ పిటిషన్ పై విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *